వాషింగ్టన్ డీసీ: హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలు, ఆయుధ డంప్ లపై అమెరికా చర్యలకు ఉపక్రమించింది. బుధవారం బీ–2 స్టెల్త్ బాంబర్ తో బాంబుల వర్షం కురిపించినట్లు గురువారం అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు మధ్యప్రాచ్యంలోని ఎర్ర సముద్రం, బాబ్ అల్ మండేబ్ గల్ఫ్, ఏడెన్ గల్ఫ్ లోని అంతర్జాతీయ నౌకలపై ఏకంగా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ లతో దాడులకు తెగబడుతోంది. ప్రపంచదేశాలు హెచ్చరికలు జారీ చేసినా హౌతీ తిరుగుబాటుదారులు పెడచెవిన పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా బీ–2తో హౌతీకి చెందిన పలు ఆయుధ డిపోలను పూర్తి ధ్వంసం చేసింది. ఈ బాంబులు ప్రపంచంలోనే అత్యంత వినాశకారిగా నిలుస్తాయనే పేరుంది. దీంతో మరోమారు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
హమాస్, హిజ్బుల్లా, హౌతీలు చేస్తున్న దాడులను ఇరాన్ వెనకేసుకు రావడమే గాకుండా వారికి భారీ ఎత్తున ఆయుధాలను అందజేస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హౌతీ స్థావరాలపై దాడులు చేయడంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై మరోమారు దాడి చేసేందుకు పూనుకుంటే అమెరికా సమాధానం చెబుతుందనే హెచ్చరికలను జారీ చేసినట్లయ్యిందని నిపుణులు భావిస్తున్నారు.