ముంబై–సన్​రైజర్స్​ మ్యాచ్​కు భారీ భద్రత

వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్​ కమిషనర్​ తరుణ్​ జోషి

Mar 26, 2024 - 19:54
 0
ముంబై–సన్​రైజర్స్​ మ్యాచ్​కు భారీ భద్రత

హైదరాబాద్‌: ఉప్పల్​స్టేడియంలో ముంబై–సన్​రైజర్స్​ మధ్య తొలి మ్యాచ్ బుధవారం  జరగనుంది. ఈ మ్యాచ్​ నిర్వహణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్​ నిర్వహణ సందర్భంగా స్టేడియానికి వచ్చే అభిమానులు, క్రీడాకారులకు రాచకొండ పోలీస్​ కమిషనర్​ తరుణ్​ జోషి పలు సూచనలు, సలహాలు చేశారు. స్టేడియంలోకి 4.30 గంటల నుంచే టికెట్లు ఉన్న వారికి అనుమతిస్తామన్నారు. మ్యాచ్​ చూసేందుకు వచ్చే వారు ల్యాప్​ట్యాప్,​నీళ్ల బాటిల్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. ప్రమాదకరమైన వస్తువులపైన నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఫోన్, బ్లూటూత్స్ లను మాత్రం అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మ్యాచ్‌కి 3గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. నాలుగు అంబులెన్స్‌లు, మెడికల్‌ టీమ్స్‌, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు జోషి తెలిపారు. టికెట్‌ కొనుగోలు చేసిన వారి కోసం పార్కింగ్‌ సదుపాయం కల్పించామన్నారు. స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రత కోసం 2,500 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించామని తెలిపారు. స్టేడియం పరిసరాల్లో, లోపల 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్టేడియం వెలుపల, లోపల భారీ ఎత్తున పోలీసు బందోబస్తు వినియోగిస్తామన్నారు.