దేశ సంపదను దోచుకున్నది కాంగ్రెస్
నారీశక్తి వ్యాఖ్యలపై మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ అటాక్

న్యూ ఢిల్లీ: దేశానికి నిజమైన వారసులమని చెప్పుకుంటున్న వారు దేశ సంపదను నదోచుకున్నారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ఇస్తూ మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మహిళల ఉన్నతి కోసం ప్రయత్నిస్తున్న నారీశక్తి నినాదాలపై జై రామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో గణాంకాలను వక్రీకరిస్తూ జై రామ్ రమేష్ గాంధీల కోవర్టుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల భద్రత కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో ‘నిర్భయ ఫండ్’ ఏర్పాటు చేసినా అందులో నుంచి వాళ్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. అదే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల కోసం 40 ప్రాజెక్టులు రూపొందించినట్లు చెప్పారు.
2023–-24 నాటికి మొత్తం రూ.7212.85కోట్లు కేటాయించగా ప్రస్తుతం వీటిలో 75శాతం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల కోసం వినియోగించామని తెలిపారు. నిర్భయ కాల్ సెంటర్లు, వన్‌స్టాప్ సెంటర్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, ముద్ర రుణాలు, అంగన్వాడీలకు గౌరవ వేతనాలు, ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన లాంటి అనేక బృహత్తర కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నామన్నారు. యావత్ భారత్‌లోని మహిళా లోకం ఈ సంక్షేమ ఫలాలపై కొనియాడుతుంటే కాంగ్రెస్ మాత్రం విమర్శిస్తోందని మండిపడ్డారు. దేశాభివృద్ధికి నారీశక్తి కీలకమైనదని ప్రధాని స్పష్టం చేసిన విషయం వీరికి ఇప్పటికీ తెలియకపోవడం వీరి అవివేకానికి నిదర్శనమని మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.