రాజకీయాలకు గుడ్‌బై
క్యాన్సర్‌తో పోరాడుతున్నా సుశీల్ మోదీ
పాట్నా: మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. బుధవారం సుశీల్ మోదీ ఈ విషయాన్ని సోషల్‌మీడియాతో పంచుకున్నారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నానని వెల్లడించారు. ఇప్పుడు ప్రజలకు చెప్పే సమయం వచ్చిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానికి వివరించానని, తన వెంట ఉన్న నాయకులు, ప్రజలు, కార్యకర్తలకు తాను సదా రుణపడి ఉంటానని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. సుశీల్ ప్రకటన అనంతరం పలువురు నాయకులు ఆయన ఆరోగ్యం గురించి ట్వీట్ చేస్తూ క్షేమాన్ని ఆకాంక్షించారు. సుశీల్ మోదీకి మొదటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో అనుబంధం ఉంది. 1971లో విద్యార్థి రాజకీయాలను ప్రారంభించారు. ఆ తర్వాత యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1990లో సుశీల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత బీహార్ రాజకీయాల్లో ఆయన స్థాయి పెరుగుతూ వచ్చింది.
2004 లోక్‌సభ ఎన్నికల్లో సుశీల్ మోదీ బీజేపీ టికెట్‌పై భాగల్‌పూర్ నుంచి ఎంపీ అయ్యారు. 2005లో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికై బీహార్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. సుశీల్ మోడీ 2005 నుంచి 2013 వరకు, 2017 నుంచి 2020 వరకు బీహార్ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2020లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుశీల్ మోదీని డిప్యూటీ సీఎం చేయాలని సీఎం నితీశ్ కుమార్ కోరుకున్నారు. కానీ, అగ్రనాయకత్వం ఆయనను రాజ్యసభకు పంపింది. ఈసారి నితీష్ కుమార్ మళ్లీ ఎన్‌డీఏలో చేరడంలో సుశీల్ మోదీ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.