ధాన్యం కొనుగోలు సకాలంలో చేపట్టాలి

ముధోల్ ఎంఎల్ఏ రామారావు పటేల్

Oct 20, 2024 - 19:03
 0
ధాన్యం కొనుగోలు సకాలంలో చేపట్టాలి

నా తెలంగాణ, నిర్మల్: వరి పంటల కోతలు ప్రారంభం కావడంతో పంటను సకాలంలో రైతులు అమ్ముకునేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులకు సూచించారు. కుంటాల మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకెపి, పిఎసిఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాల్ ధాన్యానికి రూ.2320, సాధారణ రకం ధాన్యానికి రూ.2300 లు పొందవచ్చని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

మద్దతు ధర కంటే తక్కువ రేటుకు ధాన్యం కొన్నా, కొనుగోళ్ళ సమయంలో రైతులను ఇబ్బంది పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, మధ్యలో దళరులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. రైతులు శ్రమ దోపిడికి గురి కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎండలు మండుతున్న నేపథ్యంలో హమాలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలని తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను  అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వరి ధాన్యానికి తేమ 17 శాతం వచ్చేలా చూసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. అనంతరం కుంటాల లోని రైతు వేదికలో ఆయా గ్రామాల లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కుల పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమం లో  అధికారులు, తదితరులు ఉన్నారు.