కేజ్రీవాల్ నటన ఉత్తదే
మండిపడ్డ బీజేపీ నేత గౌరవ్ భాటియా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హిందువులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రేమ, అభిమానం అంతా ఉత్తదే అని బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శించారు. ఆయన హిందూ వ్యతిరేకి అన్నదానికి సాక్ష్యాలివిగో అంటూ పలు చిత్రాలను ప్రదర్శించారు. మంగళవారం భాటియా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో స్వాస్తిక్ చిహ్నాన్ని చీపురుతో కొడుతున్న పోస్టర్ ను చూపించారు. స్వాస్తిక్ హిందువులకు పవిత్ర చిహ్నమన్నారు. అసత్య హామీలు అమలు కాలేదని ఆయనకు తెలిసిపోయిందని, ఆయన రాజకీయ జీవితం ఇక సమాప్తం అయ్యిందని, రాజకీయ అధికారం కోసమే మరోమారు హిందువులను, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే వివిధ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో 8 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. ఆరోగ్య చికిత్స, ఆసుపత్రుల నిర్మాణం అంటూ ఉదరగొట్టారని కానీ అవికూడా చేపడ్డంలో విఫలమయ్యారని ఆరోపించారు. నేడు ఓట్లు కొల్లగొట్టేందుకు పూజారులకు నెలకు రూ. 18 వేలు వేతనం ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. కొద్దీరోజుల ముందు వరకు మద్యం వ్యాపారులతో కలిసి ఆలయాలు, గురుద్వారాల బయటే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. పవిత్ర స్థలాల పవిత్రకు భంగం వాటిల్లేలా చేసి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా? అని చురకలంటించారు. హిందూ వ్యతిరేకి అయిన కేజ్రీవాల్ కు సిక్కులు, హిందువులపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని నిలదీశారు. ప్రజలు కేజ్రీవాల్ రాజకీయ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని గౌరవ్ భాటియా అన్నారు.