జాతీయ పునర్నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్. లక్ష శాఖల ఏర్పాటు దిశగా కృషి చేయాలి
నా తెలంగాణ, నిజామాబాద్ : వ్వక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తున్నదని నిజామాబాద్అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉద్ఘాటించారు. నిజామాబాద్ గిరిరాజా కళాశాల మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శాఖ సంఘామంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ స్థాపించి 98 ఏళ్ళు పూర్తి చేసుకుందని మొదట ఒక శాఖతో ప్రారంభమై నేడు 75 వేలకు పైగా శాఖలు నడుపుతున్నదన్నారు. జాతీయ భావాలు పెంపొందించడంలో, దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా పని చేస్తున్నదని అన్నారు. కలియుగంలో ధర్మాన్ని రక్షించే ధర్మరక్షకులుగా తయారుచేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రల రూపాలలో పని చేస్తున్నదని ఎమ్మెల్యే చెప్పారు. విద్యార్థి దశలో ఏబీవీపీగా, హిందూ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్‌గా, కులవ్యవస్థ నిర్మూలనలో సమరసత వేదికగా దాదాపు 40 వివిధ క్షేత్రల ద్వారా ఉత్తమ సమాజం నిర్మాణం కోసం కృషి చేస్తున్నదని వివరించారు. అన్ని రంగాలలో జాతీయ పునర్నిర్మాణం కోసం, వ్యక్తిలో మంచి గుణాలు, అలవాటు పెంపొందించే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పని చేస్తున్నదని అన్నారు. శతాబ్ది ఉత్సవాలు దృష్టిలో పెట్టుకొని స్వయం సేవకులందరు మరింత ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాలన్న సంఘ్ పిలుపుతో లక్ష శాఖలే లక్ష్యంగా పెట్టుకున్న వారి సంకల్పం నెరవేరాలని కోరారు. చిన్నప్పటినుండే పిల్లల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను సంఘ్ శాఖకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇల్లెందుల మమత ప్రభాకర్, బీజేపీ నాయకులు, శివ నూరి భాస్కర్, హరీష్ రెడ్డి, మఠం పవన్, బట్టి గిరి ఆనంద్, చింతకాయ రాజేందర్, పవన్ ముందాడ, పుట్టా వీరేందర్, బట్టు వెంకటేష్ పాల్గొన్నారు.