కేంద్ర పథకాల అమలులో సమన్వయంతో పనిచేయాలి

దిశా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

Sep 18, 2025 - 18:28
 0
కేంద్ర పథకాల అమలులో సమన్వయంతో పనిచేయాలి
స్వస్త్​ నారీ–సశక్త్​ పరివార్​ అభియాన్​ పై ఆరా
101 కేంద్రాల్లో ఉచిత వైద్య సేవలు
లోక్​ కళ్యాణ్​ మేళాతో సులభంగానే రుణాలు
బస్తీలు, మురికివాడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
డ్రైనేజీ నీరు తాగునీటిలో కలవకుండా చర్యలు చేపట్టాలి
తెలంగాణ ఏర్పడ్డాక నిధుల కొరత
ఎమ్మెల్యేగా ఉండగా 21 పాఠశాల భవనాలు, 92 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
సబ్​ స్టేషన్ల నిర్మాణానికి రూ. 390 కోట్లు మంజూరు
నా తెలంగాణ, హైదరాబాద్​: భాగ్యనగరంలో కేంద్ర సహాయ పథకాలను సమాయానుకూలంగా, సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అన్నిశాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేస్తూ హైదరాబాద్​ ప్రాభవాన్ని కాపాడుకోవాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అధ్యక్షతన గురువారం కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరుపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. 
 
వీధి వ్యాపారులకు ఆర్థిక స్వావలంభన..
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య రక్షణ ‘స్వస్త్​ నారీ–సశక్త్​ పరివార్​ అభియాన్​’ కింద నిర్వహిస్తున్న ప్రత్యేక మెడికల్​ క్యాంపుల తీరును తెలుసుకున్నారు. ఈ శిబిరాల్లో మహిళలు, పిల్లలు, క్యాన్సర్​, దంత సమస్యలు, హైపర్​ టెన్షన్​ వంటి వ్యాధుల కోసం ప్రత్యేక  పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. 101 కేంద్రాల్లో 8మంది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సేవలు అక్టోబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. లోక్​ కళ్యాణ్​ మేళా ద్వారా చిన్న వ్యాపారులకు సులభంగా రుణ సౌకర్యాలను అందజేస్తున్నామని చెప్పారు. దీంతో వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదగడానికి, ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉండడానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని వివరించారు.
 
కేంద్ర నిధులు సమర్థంగా వినియోగించుకోవాలి..
కేంద్రం నుంచి లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బస్తీలు, మురికివాడల్లోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాటి పరిష్​కారం కోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయమై ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవల యువకుడు నాలాలో కొట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులంతా కలిసి కట్టుగా పనిచేస్తూ నగర ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైనేజీ సిస్టమ్​ ను మెరుగుపర్చి తాగునీటితో కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్​ వాడీ కేంద్రాలు, హాస్టల్స్ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు  పరిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 
 
పనితీరుపై ఆరా..
తాను ఎమ్మెల్యేగా ఉండగా అంబర్​ పేట్​ నియోజకవర్గంలో ప్రత్యేక చొరవతో 21 స్కూల్​ భవనాలు, 92 కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వంలోనే అంబర్​ పేట్ నియోజకవర్గ అభివృద్ధికి, సబ్​ స్టేషన్ల కోసం రూ. 390 కోట్లను మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక నిధుల కొరత ఏర్పడిందని చెప్పారు. దిశ సమావేశంలో అనేక అంశాల పనితీరును అధికారులతో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆరా తీశారు.