అయస్కాంత ఉత్పత్తిని నగరంలోనే ప్రారంభిస్తాం
యంత్రాలను సిద్ధం చేసుకుంటున్నాం
3, 4 నెలల్లోనే ప్రయత్నాలనూ ప్రదర్శిస్తాం
ప్రధాని మోదీతో ఇప్పటికే చర్చించాం
నా తెలంగాణ, హైదరాబాద్: అరుదైన మూలకాల చైనా సరఫరా అడ్డంకులను తొలగించుకునేందుకు భారత్ అయస్కాంత ఉత్పత్తిని పెంచుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలలో స్వావలంభన కోసం కృషి చేస్తుందని వివరించారు. శనివారం నగరంలో మీడియాతో మాట్లాడారు. భాగ్యనగరంలో అరుదైన అయస్కాంతాల ఉత్పత్తిని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మైనింగ్ మంత్రిత్వ శాఖ అవసరమైన యంత్రాలను వివిధ పరిశ్రమకు కలిసి సిద్ధం చేసుకుంటుందని చెప్పారు. శాశ్వత అయస్కాంతాల తయారీలో ప్రభుత్వం త్వరలోనే తమ సామర్థ్యాలను పెంచుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే 3, 4 నెలల్లో శాశ్వత అయస్కాంతాల తయారీలో తమ ప్రయత్నాలను ప్రదర్శిస్తామన్నారు. ఈ చొరవలో పరిశ్రమ, మైనింగ్, ఇతర మంత్రిత్వ శాఖల మధ్య సహకారం ఉంటుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు.
ఖనిజ స్వావలంభనకు కృషి..
భారత్ గతంలో అరుదైన భూమి (ఖనిజ లభ్యత గల భూములు) శాశ్వత అయస్కాంతాల కోసం గతంలో భారత్ చైనాపై పూర్తిగా ఆధారపడేదన్నారు. ఇటీవల చైనా వీటి సరఫరాకు నిరాకరించడంతో భారత్ సహా, ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో కొరత ఏర్పడిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఖనిజాల స్వావలంభనకు కృషి చేస్తుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వివరించారు. 2024–-25 కేంద్ర బడ్జెట్ జూలై 23, 2024న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ప్రకటించారు. 2025 జనవరిలో కేంద్ర మంత్రివర్గం రూ. 16,300 కోట్ల వ్యయంతో, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ. 18,000 కోట్ల పెట్టుబడితో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్ సీఎంఎం) ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది.