ఉత్తరాఖండ్ ఆల్వేస్ ఆన్ సీజనే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పర్యాటకానికి కేంద్రం పటిష్ఠ చర్యలు
గంగాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
బైక్ ర్యాలీ ప్రారంభం, హర్షిల్ లోయ వ్యూ పాయింట్ సందర్శన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారని, ఈ ప్రాంతానికి ఆఫ్ సీజన్ అనేది ఉండదని, ఎల్లవేళలా ఆన్ సీజనేనని కేంద్రం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గంగా మాత ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి ప్రధాని హర్షిల్ లోయను చూశారు.
దైవిక శక్తితో నిండిన ప్రదేశం..
గురువారం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ హర్సిల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మానాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై బాధిత కుటుంబాలకు ప్రధాని తొలుత తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ప్రసంగించారు. పర్యాటక రంగంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాఖండ్ దైవిక శక్తితో నిండి ఉన్న ప్రాంతమన్నారు. ఇక్కడ గంగాదేవిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. దేశ సేవ చేసేందుకు గంగాదేవి ఆశీర్వాదమే కారణమన్నారు. పర్వతాలపై సూర్యరశ్మి ఉంటుందని, చాలా మంది సూర్యరశ్మి కోసం ఇక్కడకు వస్తారని చెప్పారు. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉత్తరాఖండ్ కు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.
సేవచేసే భాగ్యం భగవత్కార్యమే..
ఉత్తరాఖండ్, కాశీకి సేవ చేసే భాగ్యం ఉరికే రాదన్నారు. అది భగవత్కార్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి మహిళలు రూపొందిస్తున్న ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంటున్నాయని చెప్పారు. ఇక్కడి సోదరీమణులు ఎంతో ప్రేమకు తనకు కొన్ని ఉత్పత్తులను అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా ఇక్కడి పర్యాటకం కొనసాగాలనే ఉద్దేశ్యంతో కేబినెట్ మీటింగ్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. దీంతో ఏడాది పొడవునా పర్యాటకుల సంఖ్య ఇక్కడ కొనసాగనుందని చెప్పారు. అత్యంత చలిలోనూ ఇక్కడి యాత్ర స్థలాలను సందర్శించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని చెప్పారు. ఉత్తరాఖండ్ లో శీతాకాలం ట్రెక్కింగ్, స్కీయింగ్, సాహస కార్యకలాపాల్లో వేగం పెరుగుతుందని చెప్పారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంలో ఉత్తరాఖండ్ పాత్ర అభినందనీయమని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
యాత్ర స్థలాల సందర్శనకు అడ్డంకులను తొలగిస్తాం..
ప్రత్యేక అనుభూతిని కోరుకునే పర్యాటకులు భవిష్యత్ లో ఈ ప్రాంతానికి మరింతమంది వరుస కడతారని అన్నారు. పర్యాటకుల సంఖ్య మరింత పెంచుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం, ప్రజలు కూడా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్ర సహకారం ఉంటుందన్నారు. రాష్ర్టంలో గత దశాబ్ధకాలంలో చార్ ధామ్ ఆల్ వెదర్ రోడ్, ఆధునిక ఎక్స్ ప్రెస్ వేలు, విస్తరించిన రైల్వే నెట్ వర్క్ లు, విమాన ప్రయాణ సౌకర్యాలు, హెలికాప్టర్ వంటి సేవలను అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని మరింత విస్తృతం చేశామని చెప్పారు. అందరినీ ఆకర్షించేలా యాత్ర స్థలాలకు చేరుకునేందుకు ఉన్న ప్రతికూలతలను తొలగించే ఉద్దేశ్యంతో రోప్ వేలను కూడా నిర్మించనున్నామని ఈ నిర్మాణాలతోనే అభివృద్ధి ఆగిపోదని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
70 సంవత్సరాలుగా ఆ గ్రామాలనూ పట్టించుకోలే..
1962లో ఉత్తరాఖండ్‌లోని జాదున్‌గాన్, మానా గ్రామాలను చైనా ఖాళీ చేయించిందని, 60–-70 సంవత్సరాలుగా ఆ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం పునరావాసం కల్పించామని గుర్తు చశారు. 2014 కి ముందు చార్ ధామ్ యాత్రకు సగటున 18 లక్షల మంది యాత్రికులు వచ్చేవారు, ఇప్పుడు 50 లక్షలకు పైగా భక్తులు వస్తున్నారని చెప్పారు. గతంలో సరిహద్దు గ్రామాలను చివరి గ్రామాలు అని పిలిచేవారని, కానీ తమ ప్రభుత్వం మొదటి గ్రామం హోదా ఇచ్చామన్నారు.
గతంలో ఉత్తరాఖండ్ లో మోదీ పర్యటనలు..
2017, అక్టోబర్ 20 ప్రధాని మోదీ మొదటిసారి కేదార్‌నాథ్‌కు వెళ్లారు.
2018 నవంబర్ 7న రెండవసారి కేదార్‌నాథ్ చేరుకున్నారు.
2019- ప్రధానమంత్రి మూడోసారి కేదార్‌నాథ్‌కు వచ్చారు. ఇక్కడి గుహలో ధ్యానం చేశారు.
2021 నవంబర్ 5న ప్రధానమంత్రి నాలుగోసారి కేదార్‌నాథ్ లో పర్యటించారు.
2022 అక్టోబర్ 21న కేదార్‌నాథ్–-బద్రీనాథ్ చేరుకున్నారు.
2023 అక్టోబర్ 12న మానస్ కుండ్ (జాగేశ్వర్-ఆది కైలాష్) సందర్శించారు.
2023 డిసెంబర్ 8న ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యారు.
2025 జనవరి 28న డెహ్రాడూన్‌లో జాతీయ క్రీడలను ప్రధానమంత్రి ప్రారంభించారు.