దొంగలు పోయి.. గజదొంగలొచ్చారు –
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్: కిషన్ రెడ్డి – రాహుల్ గాంధీ కోసం ఢిల్లీకి డబ్బులు పంపుతున్నది – కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్స్, దోచుకోవడం – దేశ భవిష్యత్ కోసం మోదీని గెలిపించండి – మీ ఇంటి బిడ్డగా పోటీ చేస్తున్నాను ఆశీర్వదించండి – ఖైరతాబాద్ సెగ్మెంట్ జీప్ యాత్రలో కేంద్ర మంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని, దొంగలు పోయారనుకుంటే.. గజదొంగలు వచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల కోసం రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేసి పంపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్స్, దోచుకోవడమని ఆయన గుర్తు చేశారు. దేశ భవిష్యత్ కోసం మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి శనివారం ఖైరతాబాద్ సెగ్మెంట్ లో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన రక్షణ కోసం ఓటు వేయాలన్నారు. ‘‘దేశం కోసం, మన కోసం సమర్థవంతంగా మోదీ పని చేస్తున్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. దేశంలో అవినీతి లేదు.. కుంభకోణాలు, ఉగ్రవాదం, మధ్య దళారీ వ్యవస్థ లేదు. పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిచ్చారు మోదీ. ఒక సమర్థమంతమైన ప్రధాని.. దేశ గౌరవం పెంచిన నాయకుడు మోదీ. 2014లో మోదీతోపాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఒక్క రోజు కూడా సెక్రటేరియెట్ కు వెళ్లలేదు. పదేండ్లు ఫామ్ హౌస్ లో పడుకున్నరు. ఆయన ప్రజల గురించి కాదు.. ఆయన కుమారుడు, కుమార్తె గురించే ఆలోచించేవారు. అందుకే ప్రజలు ఆయనను మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ వేల ఎకరాల భూదందాలు చేసింది. బినామీల పేర్లతో రూ.కోట్లు కాజేసింది. అయ్యకో ఫామ్ హౌస్, కొడుకుకో ఫామ్ హౌస్, కూతురుకు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నది సరిపోదని.. ఢిల్లీకి వెళ్లి బీరు, బ్రాంది వ్యాపారం చేశారు. అది కూడా దొంగ వ్యాపారం చేస్తే.. దర్యాప్తు సంస్థలు కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేశాయి. కేసీఆర్ పీడ విరగడ అయిందనుకుంటే.. కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణ ప్రజలు పరిస్థితి పెంక మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. దొంగలు పోయి.. గజదొంగలు వచ్చారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్ల వద్ద, బిల్డర్ల వద్ద వసూలు చేస్తున్నారు. వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పంపుతున్నది. మీరు బెదిరించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపేందుకే ప్రజలు ఓటు వేశారా?”అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
పేదలకు ఉచిత బియ్యం..
కరోనా ఆపద సమయంలో మోదీ దేశ ప్రజల ప్రాణాలు కాపాడారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ ఉంటే ఆకలితో ఎవరూ ఉండొద్దని మోదీ పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చారు. కరోనా పోయిన కూడా మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. పేదలకు ఐదులక్షల రూపాయలు వైద్యం కోసం ప్రధాని ఇస్తున్నారు. హైదరాబాద్ లో గతంలో ఐఎస్ఐ దాడులు జరిగేవి. మత కలహాలు, కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు అవి మచ్చుక కూడా లేవు. పాకిస్తాన్ తోక కత్తిరించారు. అందరిని ఒప్పించి, మెప్పించి రాముడి గుడి కట్టారు మోదీ. ఆయన లేకపోతే కరోనా పెద్దది అయ్యేది. పాక్ ఉగ్రవాదం తగ్గేది కాదు. స్వాత్యంత్రం వచ్చిన తరువాత తొలి బీసీ ప్రధాని మోదీ. ఆయ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలి. మీ ఇంటి బిడ్డగా ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను కూడా ఆశీర్వదించండి”అని కిషన్ రెడ్డి కోరారు