రహదారులు రయ్​ రయ్

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Sep 25, 2025 - 17:48
 0
రహదారులు రయ్​ రయ్
రూ. 30,425 కోట్లతో 1,174 కి.మీ. ప్రాజెక్టులు
తెలంగాణలో 32 జిల్లాల అనుసంధానం పూర్తి
కేంద్రమంత్రి నితీన్​ గడ్కరీతో కిషన్​ రెడ్డి భేటీ
మెట్రో నిర్మాణానికి సహకారం
తెలంగాణకు ప్రాజెక్టులు ముందువరుసలో ఉంటా
స్పెషల్​ సెల్​ ఏర్పాటుతో పర్యవేక్షిస్తున్నా
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లకు సీబీఐతో దడ
సొంతంగానే బీజేపీ అధికారంలోకి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతంత్రం సిద్ధించాక 2015 వరకు తెలంగాణలో 2,500 కి.మీ. రహదారుల నిర్మాణం జరగగా, 10ఏళ్లలో మోదీ ప్రభుత్వం 5వేల కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని,  రోడ్ల నిర్మాణంలో గణనీయమైన వేగం పెంచిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించామని, మరొక జిల్లాను కూడా అనుసంధానించే పనులు కొనసాగుతున్నాయన్నారు. 
 
గురువారం కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీతో సమావేశమయ్యాక కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మీడియాకు వివరాలందించారు. ఈ సంవత్సరం 767 కి.మీ. జాతీయ రహదారి ప్రాజెక్టులను రూ. 29,555 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని చెప్పారు. 
 
జాతీయ రహదారుల నిర్మాణంలో డివైడర్లు, అండర్​ పాస్​ లు, బైపాస్​ లు ఫుట్​ ఓవర్​ నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామన్నారు. దీంతో ఇంధనం భారీగా ఆదా అవుతుందని గమ్యాన్ని వేగంగా చేరుకోగలుగుతున్నామని చెప్పారు. తెలంగాణకు విజయవాడ, బెంగళూరు, నాగ్​ పూర్​, ముంబై లాంటి ప్రధాన నగరాలతో కనెక్టివిటీని మెరుగుపరిచామన్నారు. 
 
అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్సులు, భూసేకరణ ను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తయితే పనులను వెంటనే ప్రారంభమవుతాయన్నారు. స్థానిక నాయకుల సూచనల మేరకు అవసరమైన చోట్ల రోడ్​ సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. 
 
హైదరాబాద్​– శ్రీశైలం రోడ్డులో 4 లేన్​ ఎలివేటెడ్​ ఎక్స్​ ప్రెస్​ వే చేపట్టాలని కేంద్రం భావిస్తుందన్నారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా కారిడార్​ పనులు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్​–కల్వకుర్తి 4 లేన్​ పై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ తెలిపారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. 
 
మెట్రో విస్తరణ.. 
తెలంగాణ రాష్​ర్టానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందువరుసలో తానుంటానని, ఇందుకోసం స్పెషల్​ సెల్​ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. తమ పార్టీ తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రీజనల్​ రింగ్​ రోడ్డు, హైదరాబాద్​ మెట్రో విషయంలో ప్రొయాక్టివ్​ గా వ్యవహరించామని ట్రిపుల్​ ఆర్​ కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందన్నారు. మెట్రో పనుల విషయంలో అనేక సంస్థలు రుణాలు అందజేస్తుండగా రాష్ర్ట ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని కోరుకుతున్నారని చెప్పారు. మెట్రో నష్టాల్లో నడవడం అనేది రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. దీన్ని వారే తేల్చుకోవాలన్నారు. మెట్రో నిర్మాణానికి సంబంధించి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 
 
కాళేశ్వరంపై సీబీఐ..
కాళేశ్వరంపై సీబీఐ ప్రతిపాదనలు అందాయని, పరిశీలనలో ఉన్నాయన్నారు. దీంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుందన్నారు. రెండు పార్టీలు ఈ ఫోబియాతో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ రెండు ప్రభుత్వాలే రాష్ర్టంలో అధికారాన్ని వెలగబెట్టాయని ఎద్దేవా చేశారు. బీజేపీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాము స్వతంత్రంగానే ముందుకు వెళతామని ఏ పార్టీతోనూ కలవాల్సిన అవసరం తమకు లేదని కిషన్​ రెడ్డి స్పస్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్​ పై అసెంబ్లీలో మద్ధతిచ్చామని, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాని అంశమన్నారు. కాంగ్రెస్​ పార్టీ 42 మేనిఫెస్టో హామీని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. 
 
కేటీఆర్​ పై ఆగ్రహం..
నేపాల్​ లో జరిగినట్లుగా ఇక్కడ కూడా పీఎం, మంత్రులు, న్యాయస్థానాలపై దాడులు జరగాలని కేటీఆర్​ భావిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని బాబాసాహెబ్​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దివాళాకోరు మాటలు సరికాదని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మండిపడ్డారు.
 
తెలంగాణలో జాతీయ రహదారి ప్రాజెక్టులు..
– మొత్తం1,174 కి.మీ. విలువైన జాతీయ రహదారులకు గాను రూ. 30,425 కోట్లతో ప్రారంభం.
– 422 కి.మీ. సీఐఆర్​ఎఫ్​ రోడ్డుకు రూ. 868 కోట్లు
– ఎన్​ హెచ్​ 353 సీ సిరోంచ (మహారాష్ర్ట) నుంచి మహాదేవ్​  పూర్​ 17కి.మీ. రోడ్డు విస్తరణకు రూ. 163.41 కోట్లు
– ఎన్​ హెచ్​ 930పీ గౌరెల్లి నుంచి వలిగొండ 42 కి.మీ. రూ. 690 కోట్లు.
– ఎన్​ హెచ్ 565 నకిరేకల్​ నుంచి నాగార్జునసాగర్​ 14 కి.మీ. 4 లేన్ల బైపాస్​ రూ. 516 కోట్లు.
– ఎన్​ హెచ్​ 167కె కృష్ణా నదిపై ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో సోమశిల వద్ద 1.1 కి.మీ. ఐకానిక్​ కేబుల్​ బ్రిడ్జి రూ. 1082.56 కోట్లు.
–  ఎన్​ హెచ్​ 930పీ వరంగల్​ జిల్లా తొర్రూర్​ నుంచి నెహ్రూ నగర్​ వరకు 69.1 కి.మీ. రోడ్డు విస్తరణ రూ. 674.92 కోట్లు.
–  ఎన్​ హెచ్​ 930 పీ నెహ్రూనగర్​ నుంచి కొత్తగూడెం 52.1 కి.మీ. రూ. 826.71 కోట్లు.
– ఎన్​ హెచ్​ 353 సిరోంచ నుంచి ఆత్మకూర్​ 41.3 కి.మీ. రూ. 662.67 కోట్లు.
– ఎన్​ హెచ్​ 63 మహారాష్ర్ట సరిహద్దుల నుంచి బోధన్​ వరకు 4.5 కి.మీ. రూ. 4.97 కోట్లు
– ఎన్​ హెచ్​ 365 నకిరేకల్​ నుంచి తానంచర్ల 28.67 కి.మీ. రూ. 18.72 కోట్లు.
– ఎన్​ హెచ్​ 930పి మహబూబాబాద్​ నుంచి నెల్లికుదురు, తొర్రూర్​ నుంచి నెల్లికుదురు, తొర్రూర్​ నుంచి వలిగొండ, మహబూబాబాద్​ నుంచి ఎల్లందు, గౌరెల్లి నుంచి కొత్తగూడెం 21.5 కి.మీ. రూ. 29.91 కోట్లు.
– ఎన్​ హెచ్​ 61 నిర్మల్​ నుంచి ఖానాపూర్​ 3.24 కి.మీ. రూ. 14.53 కోట్లు
– ఎన్​ హెచ్​ 161 బీబీ బోధన్​ –బాసర – భైంసా సెక్షన్​ 11.2. కి.మీ. రూ. 16.45 కోట్లు
– ఎన్​ హెచ్​ 565 నకిరేకల్​ నుంచి నాగార్జున సాగర్​ వరకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి రూ. 4.9 కోట్లు.
– ఎన్​ హెచ్​ 63 జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 63.60 కి.మీ. రూ. 2,338 కోట్లు.
– ఎన్​ హెచ్​ 63 జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 66.295 కి.మీ. రూ. 2,548 కోట్లు.
– ఎన్​ హెచ్​ 565 జగిత్యాల నుంచి కరీంనగర్​ 58.60 కి.మీ. రూ. 2,484 కోట్లు.
– హైదరాబాద్​ – పనాజీ ఎకనామిక్​ కారిడార్​ ఎన్​ హెచ్​ 167 గూడ్లవళ్లూరు నుంచి మరికల్​ 80.01 కి.మీ. రూ. 2,662 కోట్లు.
– హసన్​ పూర్​–కడూరు 10.36 కి.మీ. బైపాస్​ రూ. 344 కోట్లు.
– గిర్మాపూర్​ నుంచి తంగడపల్లి 161.518 కి.మీ. గ్రీన్​ ఫీల్డ్​ రీజనల్​ ఎక్స్​ ప్రెస్​ వే రూ. 1,397 కోట్లు.
– ఎన్​ హెచ్​ 44 కామారెడ్డి సీఎంసీ జంక్షన్​ అండర్​ పాస్​, సదాశివనగర్​ ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం 3.18 కి.మీ. రూ. 53.80 కోట్లు.
– ఎన్​ హెచ్​ 163 హైదరాబాద్​–యాదగిరిగుట్ట ఆరు లేన్లతో ఒక కిలోమీటర్​ అండర్​ పాస్​ రూ. 26.76 కోట్లు.