తొలి సూర్యోదయం.. దేశానికి కొత్త వెలుగులు

అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ

Sep 13, 2025 - 20:39
 0
తొలి సూర్యోదయం.. దేశానికి కొత్త వెలుగులు
భూపేన్​ హజారికా శతాబ్ధి ఉత్సవాల్లో నాణెం, పుస్తకం విడుదల
భూపేన్​ స్ఫూర్తిని కొనసాగిస్తాం
డీస్ఫూర్​: తొలి సూర్యోదయ రాష్ట్రం దేశానికి కొత్త వెలుగులు, కొత్త ఆశలకు రెక్కలు తొడగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈశాన్య ప్రాంతం ప్రజల త్యాగాలతోపాటు, చరిత్ర, సంస్కృతితో అనుబంధం ఉన్న ప్రాంతమన్నారు. భారత గౌరవాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తి భూపేన్​ దా అని పాటల ద్వారా ఆయన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం అసోం గౌహతికి చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు భూపేన్​ హజారికా వందో జయంతి శతాబ్ధి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. జయంతి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భూపేన్ హజారికా రూ.100 స్మారక నాణెం, పుస్తకాన్ని విడుదల చేశారు.
 
దేశ ఐక్యత స్వరం..
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. హింస, వేర్పాటువాదం అగ్ని పెచ్చుమీరుతున్నప్పుడు భూపేన్​ దేశ ఐక్యత కోసం తన స్వరాన్ని వినిపించిన తీరును ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం ఆయన కన్న కలలు మహోన్నతమైనవన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీ ఇంటికి తీసుకువెళుతున్నామని మోదీ చెప్పారు. భూపేన్​ సంగీతాన్ని సజీవంగా ఉంచుతూ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న కళాకారులను అభినందించారు. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన స్వరం, సంగీతం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తూ నూతన శక్తిని ప్రసాదిస్తుందని మోదీ స్పష్టం చేశారు. 
 
భారతరత్నతో గౌరవాన్ని పెంపొందించాం..
హజారికాకు భారతరత్న ఇవ్వడం ద్వారా ఈశాన్య గౌరవాన్ని మరింత పెంపొందించామని మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంత కలలు, ఆత్మగౌరవాన్ని మా ప్రభుత్వం గౌరవించిందని, దేశ ప్రాధాన్యతగా మార్చిందన్నారు. అసోం, అరుణాచల్‌ను కలుపుతూ దేశంలోనే అతి పొడవైన వంతెనలలో ఒకదాన్ని నిర్మించామని, దానికి భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టామన్నారు. 1962 యుద్ధం జరిగినప్పుడు అసోం ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిందని భూపేన్ తన సంగీతం ద్వారా ప్రేరణను కల్పించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
 
కాగా కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గౌహతిలోనే బస చేయనున్నారు. ఆదివారం రూ. 19వేల కోట్ల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం పశ్చిమ బెంగాల్​ కు వెళతారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 15న ఉదయం కోల్​ కతాలోని సాయుధ దళాల జాయింట్​ కమాండ్ల సమావేశం నిర్వహిస్తారు. సోమవారం మధ్యాహ్నం కోల్​ కతా నుంచి బిహార్​ పూర్ణియాకు బయలుదేరతారు.