రైల్వే కోచ్ కల సాకారం ఘనత ప్రధాని మోదీదే!
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
నా తెలంగాణ, వరంగల్: రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రజల కల. ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ ఇక్కడి పనులను పర్యవేక్షించారు. అధికారుల ద్వారా జరుగుతున్న పనుల వివరాలను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. రూ. 500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు అవుతుందన్నారు. 2026 నాటికి ఈ యూనిట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇదొక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటుందని వివరించారు. ఇక్కడ రైల్వే కోచ్ లు, ఇంజిన్లతోపాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు, బహుళ రకాల కార్యకలాపాలు ఇక్కడ జరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సంతృప్తి వ్యక్తం చేశారు.