ఘర్షణలు ముగిశాయి

మణిపూర్​ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

Sep 13, 2025 - 17:09
 0
ఘర్షణలు ముగిశాయి
సంస్కృతి, సాంప్రదాయాలు భారత్​ కు బలం
‘మణి’లోనే ప్రకాశం ఉంది
శాంతిని పునరుద్ధరించడంలో మీ వెంటే తాను
అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
రూ. 7వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ఇంఫాల్​: మణిపూర్​ ప్రజలతో తాను నిలబడే ఉన్నానని ‘మణి’ (వజ్రం)పూర్​ పేరులోనే ప్రకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలు, వైవిధ్యం, చైతన్యం భారత్​ కు గొప్ప బలమన్నారు. వివిధ జాతుల వారు హింసను విడనాడి రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ర్టంలో ఆశ, విశ్వాసం అనే నూతన ఉద్యమాలు ఆవిర్భవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది మీతోపాటు దేశాభివృద్ధికి కారణంగా నిలవాలన్నారు. ఇక హింసను విడనాడి శాంతి, అభివృద్ది, మెరుగైన భవిష్యత్​ దిశగా కొనసాగాలని, అందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా అన్ని వర్గాల ప్రజలతో కలిసి నిలుస్తుందని అన్నారు. అనేక సవాళ్లు ఉన్నా ఇక్కడి ప్రజల ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు తాము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
గిరిజన జీవితాల్లో నూతన వెలుగులు..
 మణిపూర్​ ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు తాము ఎల్లప్పుడూ ప్రయత్నించామన్నారు. ఇక్కడ రూ. 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాదులు వేశామన్నారు. కొండల్లో నివసించే గిరిజన వర్గాల జీవితాలను ఈ ప్రాజెక్టులు మెరుగుపరుస్తాయన్నారు. విద్య, వైద్యం, సౌకర్యాలను సృష్టిస్తాయన్నారు. సరిహద్దులను ఆనుకొని ఉన్న ఈ రాష్ట్రంలో కనెక్టివిటీ ఒక సవాల్​ గా ఉండేదన్నారు. అధ్వాన్నమైన రోడ్లతో మీరు ఎదుర్కొన్న సమస్యలను అర్థం చేసుకొని వీటి పరిష్కారం కోసం అన్ని రకాల పనులకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2014 తరువాత మణిపూర్​ కనెక్టివిటీ ప్రాముఖ్యతను వివరించానని గుర్తు చేశారు. ఇందుకోసం బడ్జెట్​ ను ఎంతగానో పెంచామన్నారు. నగరాలతోపాటు గ్రామాల్లోని రోడ్లపై కూడా దృష్టి పెట్టానని వివరించారు. మణిపూర్​ లో జాతీయ రహదారులపై రూ. 3,700 కోట్లు ఖర్చు చేయగా, గ్రామాల్లోని రహదారుల కోసం రూ. 8,700 కోట్ల పనులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. 
 
శాంతిమార్గంలో మీ వెంటే నిలుస్తా..
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్​ పర్యటన సందర్భంగా చురాచన్​ పూర్​ లో రూ. 7,300 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 3,600 కోట్ల అర్బన్​ రోడ్లు, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ ప్రాజెక్టులకు పునాదులు వేశారు. రూ. 2,500 కోట్లతో ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులు, 9 ప్రదేశాల్లో ఉమెన్​ హాస్టళ్లకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు, పిల్లల భవిష్యత్​ ను సాకారం చేసుకునేందుకు శాంతిమార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్గంలో తాను మీ వెంట నిలుస్తానని హామీ ఇచ్చారు. 
 
ఆశలభూమిలో హింస దురదృష్టమే..
మణిపూర్​ ఆశలభూమి అని దురదృష్టవశాత్తు అది హింస దశను దాటిందన్నారు. అనేకమంది, అనేక వర్గాల బాధితులను తాను కలిశానన్నారు. వారితో మాట్లాడానని తెలిపారు. ఇక మణిపూర్​ కొత్త ఆశలు, ఆశయాలు, విశ్వాసం కోసం ఎదురుచూస్తుందని తాను చెప్పగలనన్నారు. ఇటీవల చేసిన శాంతి ఒప్పందాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఘర్షణలు ముగిశాయని గౌరవం, పరస్పర అవగాహనతో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. నిరాశ్రయులైన 7వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇందుకు రూ. 3వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.