రైతులపై భారం పడొద్దనే ప్రధాని మోదీ ఆకాంక్ష
ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకొని ప్రయోజనాలను కాపాడే చొరవ తీసుకోవాలి
సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం 450 మెగావాట్లకు ఆమోదం
20వేల సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లను కేటాయించడంపై మంత్రి జోసికి ధన్యవాదాలు
నా తెలంగాణ, హైదరాబాద్: పీఎం కుసుమ్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులపై విద్యుత్ భారం పడకుండా ఉంటుందన్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం-కుసుమ్’ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, సీఎం చొరవ తీసుకొని పర్యావరణ పరిరక్షణ, రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు.
ఇందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రానికి డి-సెంట్రలైజ్‌డ్ గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఆమోదించడంతోపాటుగా, రాష్ట్రానికి 20,000 సోలార్ అగ్రికల్చర్ పంప్‌సెట్లను కేటాయించడం పట్ల కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సౌర విద్యుత్ ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్న నేపథ్యంలో తెలంగాణకు ఇదొక సువర్ణావకాశంగా మారనుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రజలకు, రైతులకు అందించడంలో విఫలమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.