ఎన్ఎఫ్ టీడీసీ సందర్శన
పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం
మిస్సైల్ మ్యాన్, బీకే రావ్ తదితర మహానీయుల మార్గదర్శనం గొప్పది
ప్రైవేట్ రంగంలో మరింత వృద్ధి సాధ్యం
నా తెలంగాణ, హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీ (సాంకేతికత)ని మెరుగుపరుచుకుంటూ దేశ రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఈవీ, వైద్య, అంతరిక్ష తదితర రంగాల్లో నగరంలోని నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ (ఎన్ ఎప్ టీడీసీ)ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశంసించారు. గురువారం సంస్థను సందర్శించి పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రయోగాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
మోదీ నేతృత్వంలో ఆత్మ నిర్బర్ దిశగా ముందుకు..
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంస్థకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు బీకే. రావ్, డాక్టర్ పి.రామారావు, డాక్టర్ వి. అరుణాచలం వంటి మహనీయుల మార్గదర్శనం దొరికిందన్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిన సందర్భంలో.. మినరల్స్ రీసైక్లింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియకు ఈ కేంద్రం ఎంతో కీలకంగా మారుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికతలో వృద్ధి సాధించడంతోపాటు ప్రైవేట్ రంగంతో కలిసి మరింత ప్రగతి సాధించేందుకు ఎన్ఎఫ్ టీడీసీ తీసుకుంటున్న చొరవను కేంద్రమంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని ఏవైనా సమస్యలుంటే విన్నవిస్తే ప్రధాని మోదీ దృష్టికి తీసుకు వెళతానని అధికారులకు కేంద్రమంత్రి సూచించారు. క్రిటికల్ మినరల్ రంగంలో గ్లోబల్ సప్లయ్ చైన్స్ విషయంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఎన్ ఎఫ్ టీడీసీ ద్వారా జరుగుతున్న ప్రయత్నం భారతదేశాన్ని ఆత్మ నిర్బర్ దిశగా నడిపిస్తోందన్నారు.
అడ్వాన్స్‌డ్ మ్యాగ్నెట్స్, స్ట్రాటజిక్ మెటీరియల్స్ టెక్నాలజీస్ విషయంలో అంతర్జాతీయ కేంద్రంగా ఈ సంస్థ ఖ్యాతి గడించాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.