అక్రమ వలసలపై కఠిన చర్యలు
Strict measures against illegal immigration

మహారాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సైఫ్ అలీఖాన్ పై బంగ్లాదేశీయుడి దాడి విపక్షాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మహారాష్ర్టలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు బుధవారం లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. బంగ్లా, మయన్మార్ నుంచి మహారాష్ర్టకు అక్రమంగా వలసవస్తున్న వారిపై తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది. ఇటీవలే శివసేన నాయకుడు రాహుల్ రమేశ్ షెవాలే అక్రమ వలసలపై కేంద్రమంత్రి అమిత్ షా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోమారు అక్రమవలసదారులు నివసిస్తున్న ప్రాంతాలపై అన్ని విభాగాల ఆధ్వర్యంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆధార్, ఓటర్, పాన్ కార్డు తదితర నకిలీ గుర్తింపు కార్డులను రూపొందిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ర్ట పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసు కమిషనర్, సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్, జిల్లా మేజిస్ర్టేట్ లతో వచ్చే వారంలో సమావేశం కానున్నారు.