నారీశక్తికి వందనం
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేస్తున్న నారీశక్తిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ వేదికగా పలువురు మహిళల సేవలను ప్రదర్శిస్తూ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. తన సోషల్ ఖాతాలను ఈ రోజున మహిళలే నిర్వహిస్తారని మోదీ ప్రకటించారు. సవాళ్లు, సమస్యలు, విజయాలు, అవరోధాలు, ఆటంకాలను అధిగమిస్తూ మహిళలు మరింత వృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నమోయాప్ ద్వారా తమ సందేశాలను ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శుభాకాంక్షలు..
దయ, బలం, స్థితిస్థాపకత వంటి విషయాల్లో అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెబుతూ ప్రపంచదేశాల్లో భారతీయ మహిళలు కీర్తిని సాధిస్తున్నారని, మహిళా శక్తిని చాటుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని మార్చే శక్తియుక్తులు స్ర్తీలకే సొంతమన్నారు. ఎన్నో పాత్రలను ఒంటిచేత్తో పోషిస్తూ దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి వారు చేస్తున్న సేవలు అద్భుతమైనవని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కొనియాడారు.