నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సహారా గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ కు విక్రయించడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఎస్ ఐసీసీఎల్ ఆశ్రయంచింది. సోమవారం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ విధాన నిర్ణేతలు సహారా గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీంలో దాఖలైన పిటిష్ అక్టోబర్ 14న విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది గౌతమ్ అవస్థి పేర్కొన్నారు. ఈయన సుప్రీంలో ఆస్తుల విక్రయానికి పిటిషన్ దాఖలు చేశారు. కాగా స్థిరాస్థులను ఇప్పటికే సెబీ సహారా రీఫండ్ ఖాతాలో జమచేశారు. ప్రిన్సిపల్ మొత్తంలో రూ. 24,030 కోట్లలో సహారా గ్రూప్ తన చరాస్తులు, స్థిరాస్తుల అమ్మకం/లిక్విడేషన్ ద్వారా సుమారు రూ. 16,000 కోట్లు సేకరించి, సెబీ -సహారా రీఫండ్ ఖాతాలో జమ చేసింది.
నవంబర్ 2023లో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మరణం తరువాత గ్రూప్ తన ఏకైక నిర్ణయాధికారిని కోల్పోయిందని ఎస్ ఐసీసీఎల్ పేర్కొంది. ఆయన తన జీవితకాలంలో గ్రూప్ తరపున అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. రాయ్ కుటుంబ సభ్యులు సహారా గ్రూప్ రోజువారీ వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణలో పాల్గొనలేదు. అయితే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలనే కుటుంబ సభ్యుల కోరికను దృష్టిలో ఉంచుకుని, సహారా గ్రూప్ ఆస్తులను సాధ్యమైనంత ఎక్కువ ధరకు విక్రయించాలని, ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలను త్వరగా పాటించాలని, సహారా గ్రూప్ బాధ్యతలను విడుదల చేయాలని, ప్రస్తుత ధిక్కార చర్యలను ముగించాలని నిర్ణయించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.