బాసర వీసీ వెంకటరమణ తొలగింపు

నూతన ఇన్​ చార్జీ వీసీగా గోవర్ధన్

Oct 16, 2024 - 20:34
 0
బాసర వీసీ వెంకటరమణ తొలగింపు

నా తెలంగాణ, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్​ చార్జీ వీసీగా కొనసాగుతున్న వెంకట రమణను విధులనుంచి తప్పించారు. ఆయన స్థానంలో నూతన ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ గా జెఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్ ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత కొన్నేళ్ళుగా విద్యార్థి సంఘాలు జరిపిన శాంతియుత పోరాటం ఎట్టకేలకు ముగిసినట్లయ్యింది. వీసీని తొలగించాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘ నాయకులు మొదటి నుంచి శాంతియుత పోరాటాన్ని చేశారు. అయినా ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాల వల్ల వీసీ ఇప్పటివరకు తన పదవిని కాపాడుకుంటూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పదిహేను రోజుల క్రితం ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వెంకటరమణపై ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీసీ వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ముధోల్ ప్రాంతానికి చెందిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత సర్దార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల వినతి పత్రం అందజేశారు. విద్యార్థి సంఘాల ఒత్తిడి మేరకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ట్రిపుల్ ఐటీని గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో వీసీ వెంకటరమణ తొలగించేందుకు సిఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో వీసీని  తప్పించారని  విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల పోరాటం ఫలించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.