దేశ గౌరవం కంటే ఏదీ గొప్పది కాదు

మధ్యప్రదేశ్​ లో ప్రధాని నరేంద్ర మోదీ

Sep 17, 2025 - 14:32
 0
దేశ గౌరవం కంటే ఏదీ గొప్పది కాదు
మారుతున్న నూతన భారత్​
కాకమ్మ బెదిరింపులకు తలొగ్గం
పీఎం మిత్రా పార్కుకు శంకుస్థాపన
జాతీయ పోషకాహార నిధులు బదిలీ
10వ మిలియన్​ జనరిక్​ కార్డు పంపిణీ
భోపాల్​: భారతమాత గౌరవం, కీర్తి కంటే ఏదీ గొప్పది కాదు. ప్రతీ ఒక్కరూ ప్రతి క్షణాన్ని దేశానికి అంకితం చేయాలి. ఇది మారుతున్న నూతన భారత్​. అణ్వాయుధం లాంటి కాకమ్మ బెదిరింపులకు భయపడం, ఇళ్లలోకి ప్రవేశించి మరీ చంపుతాం. దేశ సైనికులు పాక్​ ను మోకరిల్లేలా చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన 75 పుట్టినరోజున మధ్యప్రదేశ్​ లోని ధార్​ లో పర్యటించారు. భైంసోలా గ్రామంలో పీఎం మిత్రా పార్కుకు శంకుస్థాపన చేశారు. జాతీయ పోషకాహార నిధులను బదిలీ చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి కార్యకర్తలతో ముచ్చటించారు. ‘ఏక్​ బాగియా మాకే నామ్​’ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను సత్కరించారు. ధార్​ కు చెందిన ఆరాధన కల్మి అనే బాలికకు 10వ మిలియన్​ జనరిక్​ కార్డును అందజేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం వైపు ఈ ప్రయాణంలో  మహిళలు, పేదలు, యువత, రైతులు నాలుగు స్తంభాలుగా అభివర్ణించారు. 
 
5ఎఫ్​ విజన్​ పై పనిచేస్తున్నాం..
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రతీ ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, తమ తమ దుకాణాలపై స్వదేశీ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు. మిత్రా పార్కులో స్పిన్నింగ్​, ప్రాసెసింగ్​ జరుగుతుందని, ఎగుమతులు చేస్తామని దీంతో ధార్​ పేరు ప్రపంచమార్కెట్​ లో ప్రకాశిస్తుందన్నారు. తమ ప్రభుత్వం 5ఎఫ్​ అనే విజన్​ పై పనిచేస్తుందని వివరించారు. 2047 వరకు వికసిత్​ భారత్​ గా అవతరించాలంటే స్వావలంభన మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. దసరా, దీపావళీ పర్వదినాల్లో కొనే ఏ వస్తువులైనా పూర్తి స్వదేశీ ఉత్పత్తులై ఉండాలన్నారు. 
 
ఆర్థిక స్వావలంభన, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత..
తమ ప్రభుత్వం సోదరీమణులకు, కుమార్తెలకు ఆర్థిక స్వావలంభన, సాధికారత కల్పించడంపై దృష్టి సారించిందని చెప్పారు. ఇందుకుగాను ముద్ర రుణాలు ఎంతగానో ఉపయోపడుతున్నాయని, ఇప్పటికే 2 కోట్ల మందిని లక్పతీ దీదీలుగా తీర్చిదిద్దామని, మరో 3 కోట్లమందిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. పేదలకు సేవ చేయడం ఎన్నటికీ వృధా కాదని నిరూపితం అవుతుందన్నారు. 4.5 కోట్ల మంది గర్భిణీ స్ర్తీలు మాతృవందన యోజన ద్వారా రూ. 19వేల కోట్లకు పైగా పొందారని అన్నారు. మన గిరిజనులను సికిల్​ సెల్​ అనీమియా నుంచి రక్షించుకుంటామని ప్రధాని మోదీ వివరించారు. ఈ రోజు 8వ జాతీయ పోషకాహార మాసాన్ని ప్రారంభించామని చెప్పారు. ఆరోగ్యకరమైన మహిళలతో బలమైన కుటుంబాలు సాధ్యమన్నారు. తల్లి అనారోగ్యంతో ఉంటే కుటుంబంలోని అన్ని వ్యవస్థలు కూలిపోతాయని గుర్తుంచుకోవాలన్నారు. ఏ ఒక్క మహిళ కూడా అనారోగ్యానికి గురికావొద్దని, తమ ప్రభుత్వం వారిని రక్షించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆది సేవా పర్వ్​ ప్రతిధ్వని ఇప్పటికే దేశవ్యాప్తంగా వినిపిస్తుందని గొప్ప ప్రచారంగా అభివర్ణించారు.
 
పటేల్​ ఉక్కు సంకల్పం విమోచన దినోత్సవం నిర్వహణ..
సర్దార్​ పటేల్​ ఉక్కు సంకల్పాన్ని దేశం, ప్రపంచం చూసిందన్నారు. తద్ఫలితంగా సెప్టెంబర్​ 17 హైదరాబాద్​ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోగలుగుతున్నామని చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. జాతి నిర్మాణంలో నిమగ్నమైన లక్షలాది మందికి ప్రధాని నరేంద్ర మోదీ వందనాలు సమర్పించారు.