‘నవో’దయం జీఎస్టీ డబుల్​ బొనాంజా

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

Sep 21, 2025 - 18:22
 0
‘నవో’దయం జీఎస్టీ డబుల్​ బొనాంజా
నాణ్యతకు పెద్దపీట వేయాలి
మేక్​ ఇన్​ ఇండియా వస్తువులనే కొనుగోలు చేయాలి
ఆత్మనిర్భర్​ తో ముందుకు సాగాలి
2014కి ముందు ప్రజలే పన్నులను భరించారు
2017లో అమలు.. ఇప్పుడు సంస్కరణలు
దేశ ప్రజలకు ప్రధాని మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ నవరాత్రుల ప్రారంభం రోజున సూర్యోదయంతో నూతన వెలుగులను చూడనుంది. జీఎస్టీ తగ్గింపు ఫలాలు దేశంలోని అన్ని వర్గాలకు లభించనున్నాయి. ప్రపంచంలోనే భారతీయ ఉత్పత్తులు అత్యంత నాణ్యతతో కూడుకొని ఉండాలి, ఇందుకు ఎంస్​ ఎంఇ రంగాలు దేశ ప్రతిష్ఠను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ ‘మేక్​ ఇన్​ ఇండియా, ఆత్మనిర్భర్​’ ద్వారా రూపొందించిన వస్తువులనే కొనుగోలు చేయాలి. భారత్​ నిర్దేశించుకున్న స్వావలంభన దిశను అధిగమించాలంటే ప్రతీ ఒక్కరూ సంకల్ప బలంతో పనిచేయాలి. 11 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. 99 శాతం వస్తువులపై జీఎస్టీ పరిధిని తగ్గించాం, సున్నాకి తీసుకువచ్చాం. 2014కి ముందు అనేక రకాల పన్నుల భారాన్ని ప్రజలే భరించేవారు. వాటి నుంచి పూర్తిగా విముక్తి కల్పించాం. 2017లో అమలు చేసిన జీఎస్టీని సంస్కరించి దేశాభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తాం. నవరాత్రులు దేశ ప్రజలందరిలో సుఖసంతోషాలు వెల్లవిరియాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగం కేవలం పది నిమిషాలపాటే కొనసాగింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలపైనే ప్రసంగించారు. 
 
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ..
దేశ ప్రజలు 2014లో తమకు అవకాశం ఇచ్చినప్పుడే నిర్ణయించుకున్నామని, జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని సంకల్పించామన్నారు. దేశ ప్రజలందరినీ కలుపుకొని అతిపెద్ద పన్ను సంస్కరణలు చేపట్టామన్నారు. కేంద్ర, రాష్​ర్ట ప్రభుత్వాల ప్రయత్నాల ద్వారా డజన్ల కొద్దీ పన్నులతో విముక్తి పొందామని మోదీ స్పష్టం చేశారు. ఒకేదేశం, ఒకే పన్ను విధానం కల నిజమైందన్నారు. సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియలన్నారు. కాలం (సమయం) మారినప్పుడు మనం కూడా వాటితోపాటు అవసరాల దృష్ట్యా మారాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జీఎస్టీ సంస్కరణలను తీసుకవచ్చామన్నారు. 
 
మేక్​ ఇన్​ ఇండియా వస్తువులనే కొనాలి..
ఆత్మనిర్బర్​ భారత్​ లో భాగంగా మేక్​ ఇన్​ ఇండియా లో తయారైన వస్తువులనే ప్రతీ ఒక్కరూ కొనాలని, కొందామని బలమైన సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. మన యువత కృషితో, స్వేదంతో తయారైన వస్తువులనే కొందామని పిలుపునిచ్చారు. ప్రతీ దుకాణదారుడు దేశంలో తయారైన వస్తువులనే అమ్మాలని పునరుద్ఘాటించారు. దీంతో స్వదేశీ స్వావలంభన విధానం బలపడుతుందన్నారు. అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
 
పౌరులే దేవుళ్లు..
ప్రజలే దేవుళ్లని జీఎస్టీ సంస్కరణ మంత్రం వారికోసమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సంస్కరణల నిర్ణయంతో దేశ ప్రజలకు రూ. 2.5 కోట్లు ఆదా అవుతాయన్నారు. దీంతో వారి ఇతర అవసరాలను పూర్తి చేసుకోవచ్చన్నారు. ఆత్మనిర్బర్​ దిశగా ముందుకు సాగడంలో ఈ సంస్కరణలు గణనీయంగా దోహదపడతాయన్నారు. 
 
రెండే శ్లాబులు..
5, 18 శాతం పన్ను శ్లాబులు మాత్రమే వర్తించనున్నాయి. ఈ విధానం, సంస్కరణలు రోజువారీ వస్తువుల కొనుగోలు శక్తిని పెంచడంతోపాటు మరింత సరళతరం చేస్తుంది. 99 శాతం వస్తువుల ధరలు తగ్గించాం. దీంతో నిరుపేద, సామాన్య మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి, అవసరాలకు అనుగుణంగా పెరుగుతాయి. 
 
విదేశీ వస్తు బహిష్కరణ..
తెలిసి, తెలియకుండా భారత దేశ ప్రజల దైనందిన జీవితాల్లో అనేక విదేశీ వస్తువులు పాలు పంచుకుంటున్నాయి. వీటన్నింటినీ ఇక విడనాడాల్సిన అవసరం ఉంది. స్వదేశీయంగా తయారైన ఉత్పత్తులనే కొనాలి. ఈ విధానం ప్రతీ భారతీయుడి ఆలోచనా వైఖరిలో మార్పు తీసుకురావాలి. అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు కూడా తమ ఉత్పత్తుల కొనుగోలు, ఉత్పత్తి శక్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో పెట్టుబడులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. ఈ విధానంలో దేశంలోని అన్ని రాష్ర్టాలతో కేంద్రం కలిసి నడుస్తుంది. 
 
రూ. 12 లక్షల ట్యాక్స్​ ఫ్రీ..
మధ్యతరగతి ప్రజల సంపాదన రూ. 12 లక్షలపై ఎలాంటి పన్ను విధించలేదని దీంతో వారి ఆర్థిక స్వావలంభనాన్ని పెంచగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ స పష్టం చేశారు. ఇక పేదల వంతు వచ్చిందన్నారు. ఇప్పటికే దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశామన్నారు. పేదలు, మధ్య తరగతి పేదలు కొనుగోలు చేసే అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించి వారి జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచామన్నారు. 
 
బెంగళూరు టు యూరప్​.. యూరప్​ టు హైదరాబాద్​..
2014కి ముందు బెంగళూరు నుంచి హైదరాబాద్​ కు ఏవైనా వస్తువులను 570 కి.మీ. దూరం పంపాలంటే డజన్ల కొద్దీ పన్నులు ఉండేవన్నారు. ఎంట్రీ టాక్స్, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, వ్యాట్​, సేవా పన్ను ఇలా అనేకం ఉన్నాయన్నారు. దీంతో ఆయా సంస్థలు బెంగళూరు నుంచి యూరప్​ .. యూరప్​ నుంచి హైదరాబాద్​ కు పంపేందుకు ఇష్టపడేవన్నారు. లక్షలాది సంస్థలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గమనించి జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చామని, ప్రస్తుతం దేశంలోనే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒకే పన్ను విధానంతో వ్యాపార, వాణిజ్యాలు మరింత సులభతరం అయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరిని ఖర్చు నుంచి విముక్తి కల్పించామన్నారు. 
 
జీఎస్టీ డబుల్​ బొనంజా!
జీఎస్టీ సంస్కరణలు ఆదివారం అర్థరాత్రి 12 గంటల తరువాత సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మోదీ సర్కార్​ ప్రకటించిన జీఎస్టీ బొనంజా విజయదశమి (నవరాత్రుల) ప్రారంభంలో అమలు కానుంది. దేశవ్యాప్త ప్రజలకు నవరాత్రుల కాంతులు కాస్త వెలుగునీలనున్నాయి. సామాన్యులు ఖరీదు చేసే అన్ని రకాల వస్తువుల ధరలపై పన్ను పూర్తిగా తగ్గనుండగా, పలు రకాల ధరలు భారీగా తగ్గనున్నాయి. 56వ జీఎస్టీ కౌన్సిల్​ సమావేశంలో జీఎస్టీ రెండు శ్లాబులు నిర్ణయాన్ని సెప్టెంబర్​ 22 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మార్పులేంటనేది తెలుసుకుందాం.
 
రెండుకే పరిమితమైన శ్లాబులు..
సెప్టెంబర్​ 3న జీఎస్టీ శ్లాబులను 5, 12, 18, 28 నుంచి రెండుకు 5, 18శాతాలకు తగ్గించారు. పొగాకు, పాన్​ మసాలా, కార్బోనేటేడ్​ పానీయాలు, పెద్ద కార్లు, పడవలు, వ్యక్తిగత ఉపయోగం కోసం వినియోగించే విలాసవంతమైన వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధించారు. అదే సమయంలో ఆహార పదార్థాలు పనీర్​,రోటీ, చపాతీ తదితర వస్తువులపై పూర్తి పన్నుకు మినహాయింపు నిచ్చారు. సబ్బులు, షాంపూలు, ఆహారం, ఎలక్ర్టానిక్​ కార్లు వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి. ఆరోగ్య బీమాపై పన్నును సున్నాకి తగ్గించారు. 
 
తగ్గింపు..
సిమెంట్​ పై 28 శాతం నుంచి 18 శాతం, టీవీలు, ఏసీలపై 28 శాతం 8 శాతం తగ్గించారు. అదే సమయంలో క్యాన్సర్​ లాంటి తీవ్ర మైన 33 వ్యాధులపై ఎలాంటి పన్ను ఉండబోదు.చిన్నకార్లపై పన్ను తగ్గించగా, పెద్ద కార్లపై పన్ను 40 శాతంగా పెరగనుంది. సామాన్యుడు కొనుగోలు చేసే ఆటో విడిభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతం వరకు తగ్గించారు. 
 
లెక్కింపు ఉదాహరణ..
ఒక వస్తువు రూ. 100లు అయితే దానిపై 18 శాతం రూ. 18 అవుతుంది. మొత్తం రూ. 118 అవుతుంది. మార్పు తరువాత ఆ వస్తువు 5 శాతం పరిధిలోకి వస్తే మొత్తం ఖరీదు ధర రూ. 105 (రూ. 13లాభం, మినహాయింపు) అవుతుంది. 
 
కార్ల ధరలు..
మారుతీ సుజుకి ఆర్టిగా, డిజైర్​, వెగన్​ ఆర్​, బలెనో వంటి కార్ల ధరలపై రూ. 32 వేల నుంచి రూ. 81 వేల వరకు తగ్గింపు ధరలకు లభ్యం కానున్నాయి. అయితే ఉత్పత్తి చేసిన కార్లు పాతవైనా కొత్త జీఎస్టీ వర్తించనుంది. 
 
జీఎస్టీ ఇవ్వకుంటే..
ఒకవేళ ఏవైనా దుకాణదారులు జీఎస్టీపై తగ్గింపునకు నిరాకరిస్తే.. ఫిర్యాదు చేయొచ్చు. జరిమానాలు, జైలు శిక్ష వంటి చట్ట నిబంధనలు వర్తిస్తాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం టోల్​ ఫ్​రీ నెంబర్​ 1800–11–4000, 1800–1200–232లపై ఫిర్యాదు, కాల్​ చేయొచ్చు. నేషనల్​ యాంటీ ప్రాఫిటీరింగ్​ అథారిటీ వెబ్​ సైట్​ లో ఫిర్యాదు చేయొచ్చు. బిల్లు కాపీ, దుకాణదారుడి పేరు,చిరునామా సమర్పించాలి. 
 
ఆరోగ్య బీమా..
గతంలో ఆరోగ్య బీమా వంటి వాటిపై 18 శాతం పన్ను ఉండేది. ప్రస్తుతం అది సున్నాకి తగ్గింది. దీంతో రూ. 50వేల ప్రీమియంతో కుటుంబ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే పూర్తిగా వర్తించనుంది. గతంలో పన్ను ప్రయోజనం ఉండేది కాదు. 
 
మత్తుపదార్థాలు, లగ్జరీ వస్తువులు..
పాన్​ మసాలా, జర్డా, సిగరెట్లు, షుగర్​ డ్రింక్స్​, ఎయిర్​ క్రాఫ్ట్​ ప్రయాణాలు, ఆయుధాలపై 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. బొగ్గుపై 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. 
 
మారని ధరలు..
– తాజా పండ్లు, కూరగాయలు, పాలు, పిండి, బ్రెడ్​, రొట్టెలపై ఎలాంటి సుంకాలు విధించలేదు.
 
– బంగారం, వెండి, వజ్రాలు, విలువైన రాళ్లపై గతంలో ఉన్న జీఎస్టీ 3 శాతానికే పరిమితం చేశారు.
 
– మొబైల్​ ఫోన్లు, ల్యాప్​ టాప్​ లు,  కంప్యూటర్లు వంటి వాటిపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది.
 
హోటల్స్​..
– రూ. 100 కంటే తక్కువ అద్దె ఉన్న హోటల్​ గదులు పన్ను రహితంగానే ఉండనున్నాయి. రూ. 1000 నుంచి రూ. 7,500 వరకు 12 శాతం నుంచి 5 శాతానికి పన్నును తగ్గించారు. రూ. 7,500 కంటే ఎక్కువ అద్దె కలిగిన హోటళ్లు, రూమ్​ లపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది. 
 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అంచనాలు..
జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థలోకి రూ. 2 లక్షల కోట్లు అదనంగా వస్తాయని భావిస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో ఉత్పత్తి చక్రాన్ని ప్రేరేపించనున్నారు. దీంతో జీడీపీ వృద్ధి పెరుగుతుంది. ఈ సంస్కరణలు వినియోగ డిమాండ్​ ను 1 నుంచి 2 శాతానికి పెంచనున్నాయి. రాబోయే 4 నుంచి ఆరేళ్లలో జీడీపీ వృద్ధి పెరుగుదలకు కారణమవుతుంది. 
 
మోదీ జాతినుద్దేశించి ప్రసంగాలు..
– 2016, నవంబర్ 8  రాత్రి 8 గంటలకు నోట్ల రద్దు. 
- 2019 ఆగస్ట్​ 8 ఆర్టికల్​ 370 రద్దు.
– 2020  మార్చి 19 (కరోనా).. దేశవ్యాప్తంగా కర్ఫ్యూకు విజ్ఞప్తి. 
– 2020 మార్చి 24.. 21 రోజుల లాక్​ డౌన్​.
– 2020 ఏప్రిల్​ 3.. 9 నిమిషాలపాటు లైట్లను ఆపాలని విజ్ఞప్తి.
– 2020 ఏప్రిల్​ 14.. లాక్​ డౌన్​ పొడిగింపు.
– 2020 ఏప్రిల్​ 12 ఆత్మనిర్బర్​ భారత్​ అభియాన్​ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన.
– 2020 జూన్​ 30.. ఆహార పథకం (ఉచిత రేషన్​) అందజేత.
– 2020 అక్టోబర్​ 20 కరోనాపై అలక్ష్యం వద్దని విజ్ఞప్తి.
 
సోషల్​ మీడియాలో హర్షం.. టెన్షన్​
కాగా ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలిశాక సోషల్​ మీడియా మాధ్యమంగా హర్షం వ్యక్తం చేస్తూ అనేక ప్రకటనలు కనిపించాయి. అదే సమయంలో పలువురు ప్రధాని ప్రకటనపై టెన్షన్​ ఫీలవుతున్నామన్నారు. ఏయే సమస్యలను ప్రస్తావిస్తారని, రూ. 500 నోట్లను రద్దు చేస్తారా? అని ఇలా అనేకానేక ప్రకటనలు కనిపించాయి. పలు ప్రకటనల్లో అయితే ఈసారి మోదీ ఇచ్చే బొనంజాకు కాంగ్రెస్​ చతికిలపడడం ఖాయమని మీమ్స్​ పేల్చడం గమనార్హం.