బోర్డు ఏర్పాటుతో రైతులకు ఆర్థిక స్వావలంభన
నూతన పద్ధతులపై శిక్షణ
బిహార్ రైతులకు చేకూరనున్న ఆర్థిక స్వావలంభన
మఖానా దండపై ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మఖానా (తామర గింజలు) పంటకు అమాంతంగా అంతర్జాతీయ ఇమేజ్ రావడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారమే ముందువరుసలో ఉందని చెప్పాలి. ఈ పంటలో ఉన్న పోషకాలు, పంట రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం పట్ల ప్రధాని మోదీ ఈ పంటకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ ను కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో ఎక్కడ వెళ్లినా ఈ పంటను గురించి ప్రత్యేకతలు వివరించారు. ఒకసారి బిహార్ లో మఖానా దండ వేసుకోగా ఈ అంశం అంతర్జాతీయంగా ట్రెండ్ మారి, భారీ ఎత్తున ఏం దండ అనే సెర్చింగ్ కు, చర్చకు దారి తీసింది. దీంతో అంతర్జాతీయ శాస్ర్తవేత్తలు, వైద్యులు, ప్రజల్లోనూ ఈ పంట ప్రత్యేకతను తెలుసుకోగలిగారు. అలా మరుగునపడబోతున్న పంటను నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ కల్పించడంలో ప్రధాని మోదీనే మఖానా బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారనే చెప్పాలి.
రూ. 100 కోట్లతో బోర్డు ఏర్పాటు..
ఇటీవల మఖానా బోర్డును రూ. 100 కోట్లతో కూడా ఏర్పాటు చేయడం విశేషం. 90 శాతం పంట బిహార్ లో ఉత్పత్తి అవుతుంది. ఇది ఆ ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. ఆర్థిక స్వావలంభనను చేకూర్చనుంది. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి, అభివృద్ధి, నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెట్, ఎగుమతులు మోదీ నిర్ణయంతో మరింత సులభతరం అయ్యాయి. దీంతో మఖానా కాస్త సూపర్ ఫుడ్ గా మారింది. ఎగుమతులకు మార్కెట్లను పెద్ద ఎత్తున తెరిచారు. దీంతో క్రమేణా మఖానాకు డిమాండ్ అధికమవుతుంది. దీంతో బోర్డు ఏర్పాటు తప్పనిసరైంది. 35వేల హెక్టార్లలో సాగవుతున్న ఈ పంట ప్రస్తుతం రూ. 5వేల కోట్ల మార్కెట్ ను కలిగి ఉంది. గతంలో ప్రాభవాన్ని కోల్పోయిన ఈ పంట పండిస్తున్న రైతులు ప్రస్తుతం అత్యధిక ధరలు లభిస్తుండడంతో మోదీ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మరింత మెరుగైన శిక్షణ, ఆర్థిక సహాయం, ఆధునిక సాంకేతికత, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నారు.
బిహార్ మఖానాకు ప్రత్యేక గుర్తింపు..
మధుబని, దర్భాంగా, సీతామర్హి, సహర్సా, కతిహార్, పూర్నియా, సుపాల్, కిషన్‌గంజ్, అరారియా వంటి జిల్లాలు ఇప్పటికే మఖానా ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు బోర్డు ఏర్పాటు ఈ ప్రాంతాల ఆర్థిక స్థితికి కొత్త కోణాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ‘మఖానా బీహార్ గుర్తింపు, సంప్రదాయంలో ఒక భాగం. జాతీయ మఖానా బోర్డు ఏర్పాటు రైతులకు, రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక అవకాశం’గా పేర్కొన్నారు. మఖానా ఇకపై చెరువులలో పండించే ధాన్యం మాత్రమే కాదు, ఇది బీహార్ రైతుల భవిష్యత్తుకు, భారతదేశ వ్యవసాయ శక్తికి చిహ్నంగా మారింది. జాతీయ మఖానా బోర్డు ప్రారంభంతో ఈ పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో బీహార్ ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా, భారతదేశ వ్యవసాయ ఎగుమతులకు ముఖ్యమైన స్తంభంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
మఖానాలో పోషకాలు..
మఖానాను ఫాక్స్ నట్స్, గోర్గాన్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి సూపర్ ఫుడ్. ఇందులో కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాసియం, ఐరన్, భాస్వరం వంటి పోషకాలుంటాయి. ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సోడియం, అధిక మెగ్నీషియం, పొటాసియం రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య నివారణకు పనిచేస్తాయి.