బోనాల పండుగను ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి
నా తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రం, దేశంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రార్థించారు. ఆదివారం హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా వేకువజాము నుంచే కేంద్ర మంత్రి పలు ప్రాంతాల్లోని మైసమ్మ, మహాంకాళి అమ్మవార్ల దేవాలయాల్లో దర్శనం చేసుకున్నారు. అనంతరం పూజాధికార్యక్రమాలు, వేదపండితుల ఆశీర్వచనాలు, ప్రత్యేక హారతి, ప్రసాదాల వితరణలు నిర్వహించారు.
అంబర్ పేట్ లోని శ్రీ మహాంకాళి అమ్మవారు, మల్లేపల్లిలోని శ్రీ కట్టమైసమ్మ, నింబోలి అడ్డ మహాంకాళి ఆలయం, హిమాయత్ నగర్ విట్టల్ వాడిలోని శ్రీ ముత్యాలమ్మ, మహాంకాళి అమ్మవారు, కార్వాన్ లోని శ్రీ దర్బార్ మైసమ్మ, మోహదీపట్నంలోని కనక దుర్గ సేవా సమితి ఆలయాలను సందర్శించి దర్శనం చేసుకున్నారు. బోనాల పండుగను ప్రజలంతా ఐక్యతతో, భక్తి శ్రద్ధతలతో జరుపుకోవాలని, వారి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని అమ్మవారిని ప్రార్థించారు.