డ్రగ్స్ నుంచి యువతను రక్షించుకుందాం
3కె రన్ ప్రారంభంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
పరిపూర్ణ మేథోశక్తి మన సొంతం
ప్రధాని మోదీ కలలను నిజం చేద్దాం
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచాన్ని శాసించే మేథాశక్తి భారత యువత సొంతం. అలాంటి యువతను కాపాడుకొంటూ దేశ భవిష్యత్తును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డ్రగ్స్ ఫ్రీ కంట్రీ కోసం అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని పుట్టిన రోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘సేవా పక్వాడా’లో భాగంగా ఆదివావారం ‘నశాముక్త్’ (మత్తు నుంచి విముక్తి) 3కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మేథో సంపత్తి పూర్ణంగా ఉన్న యువత మనదేశానికుందన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో చైతన్యం, పిల్లలను మత్తుకు బానిసలుగా మార్చకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమైక్యంగా ఇటువంటి చర్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం వల్ల యువత మేథోసంపత్తి దేశాభివృద్ధిలో కీలక సహకార యోగ్యంగా మారుతుందన్నారు. దీంతో అన్ని రంగాల్లో ప్రపంచాన్ని శాసించే అవకాశం లభిస్తుందన్నారు. 2047 వరకు ప్రధాని నరేంద్ర మోదీ కన్న కల నెరవేరాలంటే దేశం నుంచి డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమికొట్టాల్సిందే అని ఇందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు కీలక భూమిక పోషించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.