రెపోరేటు తగ్గింపు మిలియన్ డాలర్ల ప్రశ్నే?
Is repo rate reduction a million dollar question?
ఇప్పటికే జీఎస్టీ బొనాంజ అందించిన కేంద్రం
ప్రపంచ వ్యాప్త అనిశ్చితుల్లోనూ భారత్ బలమైన స్థితిస్థాపకత
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటు 5.5 శాతం నుంచి మారుతుందా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నేనని, తగ్గింపు ఆశలు ఉంటాయా? ఉండవా? అనేది ఆర్బీఐ ఎంపీసీ (ద్రవ్య పరపతి సమావేశం) తరువాత తేలుతుందని ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఎంపీసీ సమావేశం కానుంది. అనంతరం రెపోరేటును ప్రకటించనుంది. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుందని, జీఎస్టీ శ్లాబుల నిర్ణయం ఎవ్వరూ ఊహించలేనిదన్నారు. ఏ దేశ ప్రభుత్వాలు ఇంతపెద్ద సాహసాన్ని చరిత్రలో చేసిన ఘటనలు లేవన్నారు. మోదీ ప్రభుత్వం సామాన్యులకు, మధ్యతరగతికే గాకుండా ప్రతీఒక్కరికీ మేలు జరిగేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రెపోరేటు తగ్గింపుపై ఆర్బీఐ ఏం నిర్ణయిస్తుందో చెప్పడం కష్టమే అన్నారు. ఒకవేళ ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తే ఇది ట్రిపుల్ బొనంజానే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2025–26 తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిస్థాపకతను ప్రదర్శించిందని, ఐదు త్రైమాసికాల్లోనూ అత్యధిక వృద్ధిని సాధించిందన్నారు. అమెరికా సుంకాలు పెంచడం, ప్రపంచదేశాల్లో యుద్ధ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఇస్లామిక్ దేశాల ఐక్యత, ఆంగ్లేయ దేశాల కన్నెర్ర, ఈజిప్టు దేశాల డోలాయమానం మధ్య భారత స్థితిస్థాపకత అత్యంత మెరుగ్గా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ద్వారా భారీ లబ్ధి పొందుతున్నందున మరోమారు రెపోరేటు తగ్గింపును ఆశించడం కూడా తప్పే అవుతుందని ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.