ఊహాకందని వైద్యం భారత్​ సొంతం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి

Sep 13, 2025 - 14:19
 0
ఊహాకందని వైద్యం భారత్​ సొంతం
మోదీ నేతృత్వంలో ఆయుర్వేద మహాత్మ్యాన్ని చాటి చెప్పాం
ప్రపంచానికి మార్గదర్శకాలు చరకుడు, సుశ్రుతుడు, వాగ్​ భట్టు గ్రంథాలు
వెల్​ నెస్​ లో ప్రపంచానికి హబ్​ భారత్​
177 దేశాలు యోగా డేను నిర్వహిస్తున్నాయి
పసుపు, తిప్పతీగ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది
రామ్​ దేవ్​ బాబాకు అండగా నిలబడదాం
రామంతపూర్​ లో ఆయుష్​ కు సిద్ధమే
భూసేకరణ, డీపీఆర్​ అందజేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి సూచన
నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రపంచం ఊహాకందని వైద్య విజ్ఞానం మన భారతదేశ సొంతమని, ఇంతటి గొప్ప వైద్యాన్ని ప్రోత్సహించే విషయంలో గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదని, వైద్యానికి పనికిరానిదిగా చూశాయని మండిపడ్డారు. కానీ 2014 మోదీ అధికారంలోకి వచ్చాక ఆయుర్వేద మహ్మాత్మ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నాలకు అంకురార్పణ చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. వేల ఏళ్ల క్రితమే ఆపరేషన్లు, కృత్రిమ అవయవాలు, టాక్సికాజీ, డయాగ్నస్టిక్​ టెస్టులు, కాటరాక్ట్​ ఆపరేషన్లు చేసిన ఘనమైన చరిత్ర మనన్నారు. ఇందుకు మనమంతా గర్వపడాలన్నారు. చరకుడు, సుశ్రుతుడు, వాగ్‌భట్టు వంటి ఎందరో మహానుభావులు ప్రాచీన భారత విజ్ఞానం ద్వారా నాటి సమాజానికి వైద్యం చేశారని వివరించారు. వీరు రాసిన గ్రంథాలే నేడు యావత్​ ప్రపంచానికి మార్గదర్శనం చేశాయన్నారు. సుశ్రుతుడు ఫాదర్​ ఆఫ్​ సర్జరీ అని, చరకుడు ఫిజియాలజీ థెరపీల గురించి మానవాళికి సమస్త జ్ఞానాన్ని అందించారని కొనియాడారు. భారతీయులంతా గర్వపడేలా ఆయుర్వేదాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి ‘వెల్​ నెస్​’ విషయంలో ప్రపంచానికి హబ్​ గా మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని కిషన్​ రెడ్డి హర్షం వ్య్తం చేశారు. 
 
ఆయుర్వేద కాన్షరెన్స్​ 2025లో కేంద్రమంత్రి..
శనివారం యూసుఫ్​ గూడలోని నిమ్స్​ మే ప్రాంగణంలో నేషనల్​ ఆయుర్వేద కాన్ఫరెన్స్​ 2025 కార్యక్రమంలో  కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విశ్వ ఆయుర్వేద పరిషత్ ను ప్రత్యేకంగా అభినందించారు. మూడు దశాబ్దాలుగా.. ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంతోపాటుగా.. ఈ ప్రాచీన భారత వైద్య విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు అందిస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. ఆయుర్వేదం అంటే చెట్లు, మూలికల ద్వారా మందులు ఇవ్వడం మాత్రమే కాదని, యోగా ద్వారా శారీరక, మానసిక సమతుల్యతను పంచడం కూడా ఆయుర్వేదమేనన్నారు. ఇవాళ్టి ఈ కాన్ఫరెన్స్ థీమ్ అయిన ‘ఏన్షియంట్ ఇన్‌సైట్స్ మోడ్రన్ అడ్వాన్స్‌మెంట్స్’ మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద పునర్వైభవం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 
 
యోగా, ఆయుర్వేదానికి మోదీయే బ్రాండ్​ అంబాసిడర్​..
ప్రధాని పదవి చేపట్టాక మోదీ ఆరు నెలల్లోనే ఆయుర్వేదానికి, యోగాకు సరైన గుర్తింపు తీసుకువచ్చేందుకు తానే అంబాసిడర్​ గా బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచదేశాలకు యోగా ప్రాముఖ్యతను వివరించడంలో కృతకృత్యులైన జూన్​ 21న ‘అంతర్జాతయ యోగా దినోత్సవం’ నిర్వహించేలా చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. 177 దేశాలు యోగా డేను నిర్వహిస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ యోగా మానవాళికి ఎంతో భరోసా కల్పించిందన్నారు. కేంద్రమంత్రి అమిత్​ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్​ ఫోర్స్​ కు తానే బాధ్యత వహించానని చెప్పారు. ఈ ఆయుర్వేద విధానం ద్వారానే 140 కోట్ల మంది ప్రజల ప్రాణాల్ని కాపడగలిగామన్నారు.
 
సాంప్రదాయ వైజ్ఞానిక విద్యను కాపాడుకుందాం..
ప్రస్తుతం పసుపు వినియోగం పెరగడం, తిప్పతీగ (గిలోయ్) ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటివాటిని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారని చెప్పారు. ఆత్మనిర్భర్​ భారత్​ ‘వికసిత్​ భారత్​ 2047’ లక్ష్యాల్లోనూ ఆయుష్​ మంత్రిత్వ శాఖ ఓ ప్రధానమైన భూమిక పోషించనుందన్నారు. దేశాన్ని గ్లోబల్​ వెల్​ నెస్​ కేంద్రంగా మార్చడంలో అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. బహుళజాతి సంస్థలు ఆయుర్వేదాన్ని, యోగాని అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని వీటిని తిప్పికొడుతూనే మన సాంప్రదాయ వైజ్ఞానిక విద్యని కాపాడుకోవాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
వైద్యులు సంకల్పంతో పనిచేయాలని విజ్ఞప్తి..
వైద్యులు ఉపాధి కోసం పనిచేయాలనే ఆలోచనలను పక్కన పెట్టి, మన దేశ సంపద, జీవన విధానం, భారతీయ వైద్య భావితరాలకు అందించాలనే సంకల్పంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రామ్​ దేవ్​ బాబా లాంటి వారు కొన్ని మందులు తీసుకొస్తే దానిపై కూడా సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా వారికి అండగా నిలబడాలని, మన సంస్కృతిని పరిరక్షించుకోవాలని అన్నారు. యోగా భారతదేశ ప్రాచీన విజ్ఞానమే అయినా ఐపీఆర్ (మేధో సంపత్తి హక్కు–ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్) తీసుకోలేదన్న 2016 ప్రధాని మోదీ మాటలను గుర్తు చేశారు. ఆరోగ్యకర ప్రపంచ నిర్మాణం కోసం యావత్​ ప్రపంచానికి అందించాలన్న లక్ష్యంతోనే ఐపీఆర్​ తీసుకోలేదన్నారు. 
 
ఆయుర్వేదాన్ని వాడుతున్న వందకుపైగా దేశాలు..
నేషనల్​ ఆయుష్​ మిషన్​ (ఎన్​ ఎఎం) మిషన్​ కింద సిద్ధిపేట, వికారాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. ఆయుష్​ మంత్రిత్వ శాఖ ఒక్కో కేంద్రానికి రూ. 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. హైదరాబాద్​ రామంతపూర్​ లోనూ ఆయుష్​ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని భూసేకరణ, డీపీఆర్​ ను రాష్​ర్ట ప్రభుత్వం అందించాలని కిషన్​ రెడ్డి కోరారు. ఇప్పటికే తెలంగాణలో 420 ఆయుష్​ హెల్త్​ అండ్​ వెల్​ నెస్​ సెంటర్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయని వివరించారు. 440 ఆయుష్​ డిస్పెన్సరీల్లో 224 ఆయుర్వేదం, 122 యునానీ, 94 హోమియోపతి కేంద్రాలున్నాయని తెలిపారు. ఇవిగాకుండా 366 ఎన్​ ఆర్​ హెచ్​ ఎం డిస్పెన్షరీలు కూడా తెలంగాణలో ఉన్నాయన్నారు. ఇందులో 199 ఆయుర్వేదం, 62 యునానీ, 105 హోమియోపతి డిస్పెన్షరీలున్నాయి తెలిపారు. ఆరోగ్య భారత్​ నిర్మాణంలో 7.5 లక్షల మంది ఆయుష్​ ప్రాక్టీషనర్లు పనిచేస్తున్నారని వివరించారు. తెలంగాణలో ఆయుష్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్.. రూ.16.05 కోట్లు కేటాయించిందన్నారు. 2014లో 3 బిలియన్ డాలర్లున్న (రూ. 26.5 వేల కోట్లు) ఆయుష్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 8 రెట్లు పెరిగి 24 బిలియన్ డాలర్లకు (రూ. 2.12 లక్షల కోట్లు) చేరుకుందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. ‘వసుదైక కుటుంబం’ నినాదానాన్ని పాటిస్తూ ప్రపంచానికి భారత్​ జ్ఞానాన్ని పంచుతుండడంతో వందకు పైగా దేశాల్లో ఆయుర్వేదాన్ని వాడుతున్నారని ఇది భారత్​ కు గర్వకారణమన్నారు. హైదరాబాద్​ లో ఆయుర్వే పరిశోధనా సంస్థలకు మరింత అవకాశం ఉందని అన్నారు. 
 
ఐఐటీ, ఐఐఎస్​, జేఎన్​ ల్లోనూ ఆయూష్​ సెంటర్లు..
ఐఐటీ, ఐఐఎస్​, జేఎన్​ యూ వంటి యూనివర్సిటీల్లోనూ ఆయూష్​ సెంటర్స్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ ఏర్పాటయ్యాయన్నారు. ఆధునిక శాస్ర్త విజ్ఞనానికి మన ప్రాచీన జ్ఞానాన్ని జోడించేందుకు ఇదే సరైన సమయమని ఆయుర్వేద విభాగ మేధావులు, ప్రాక్టీషనర్లు ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం నలుమూల ఆలోచనలు, పరిశోధనలను పంచుకోవాలని, విస్తరించే కీలక బాధ్యతలను తీసుకోవాలని వివరించారు. 2047 నాటికి ఆయుష్​ విభాగం అభివృద్ధికి కీలకమైన మూలస్తంభం కావాలని ఇందుకు సంకల్పంతో పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.