నిరుపేదలకు మేలు చేశారా?

పార్లమెంట్​ లో ప్రధాని నరేంద్ర మోదీ

Feb 4, 2025 - 18:14
 0
నిరుపేదలకు మేలు చేశారా?

అద్ధాల మేడలూ నిర్మించుకోలేదు
భారత రాజ్యాంగమే తమ అంతరాత్మ
రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మోదీ కృతజ్ఞతలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలకు పేదలపై చర్చించేందుకే సమయం సరిపోదని ఇక వారు నిరుపేదలకు మేలు ఏం చేకూరుస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలదీశారు. పేదలకు సేవ చేసి, వారి అభివృద్ధిని కాంక్షిస్తున్న పార్టీ బీజేపీ అని మోదీ అన్నారు. తాము ఏనాడు అద్దాల మేడలు నిర్మించుకోలేదని పరోక్షంగా కేజ్రీవాల్​ ను విమర్శిస్తూ అన్నారు. దేశంలో విషపు రాజకీయాలకు తాము సహించబోమన్నారు. దేశ ఐక్యత కోసం రాజకీయాలు చేస్తామన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ మన రాజ్యాంగమేనని పునరుద్ఘాటించారు. తమకు రాజ్యాంగాన్ని గౌరవించే సాంప్రదాయం ఉందని, అదే సమయంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే, అపహాస్యం చేసే పార్టీ వారిదని ఆరోపించారు. మంగళవారం రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ బడ్జెట్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్​ లో సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ర్టపతికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం తనకు లభించడం పట్ల ధన్యుడనన్నారు. రాష్ర్టపతి నిరంతరం దేశంలోని నిరుపేదలు, గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అందుకు తామంతా ఋణపడి ఉండాలన్నారు. నిజమైన అభివృద్ధిని అందించేందుకు రాష్ర్టపతి నిరంతరం పనిచేశారని కొనియాడారు. 

20, 21 శతాబ్ధాల్లో ఏం జరిగాయో ప్రజలకు తెలుసు..
20వ శతాబ్ధంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి సంకల్పాన్ని, నూతన విశ్వాసాన్ని ప్రజల్లో కల్పిస్తూ స్ఫూర్తి దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. 25 కోట్ల మంది నిరుపేదలను దారిద్ర్యరేఖ నుంచి బయటపడవేశామన్నారు. ఆ పార్టీల హయాంలో ఇలా జరిగి ఉంటే పక్కకు కూర్చునేది కాదన్నారు. ప్రజలకు అంతా తెలుసన్నారు. ఎవరు దేశానికి, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేస్తున్నారనేది పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. అందుకే ఆ పార్టీలను ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారన్నారు. అయినా వీరితీరులో ఏ మాత్రం మార్పురాకపోవడం శోచనీయమన్నారు. 

గుడిసె వాసుల బాధలు ఎందుకు అర్థం చేసుకోలేదు..
4 కోట్ల మంది నిరుపేదలకు ఇళ్లు ఇచ్చామన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు గుడిసెలో ఉంటున్న వీరి బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందని మోదీ నిలదీశారు. ఇప్పుడు వారంతా ధీమాగా ఉంటున్నారని చెప్పారు. కనీసం మరుగుదొడ్లు నిర్మించకుండా అలక్ష్యం చేశారని తెలిపారు. దీంతో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులకు చెక్​ పెట్టాలని నిర్ణయించి మోదీ ప్రభుత్వం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించిందన్నారు. సోదరీమణులు, కుమార్తెల కష్టాలను అర్థం చేసుకున్నాము కాబట్టే ఈ నిర్ణయం తీసుకొని విజయవంతంగా దేశాన్ని స్వచ్ఛత దిశగా తీసుకువెళుతున్నామని చెప్పారు. 

కనీసం మంచినీరైనా ఇచ్చారా?..
స్వాతంత్ర్యం చేకూరి 75 ఏళ్లు గడుస్తున్నా మీ హయాంలో ఏం చేశారని నిలదీశారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా కుళాయి ద్వారా కల్పించలేక చేతులెత్తేశారని విమర్శించారు. 16 కోట్లకు పైగా 75 శాతం కుటుంబాలకు నల్లా కనెక్షన్​ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం 12 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించిందని, మిగతా వారందరికీ అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దేశంలో ఏ ఒక్క ఇళ్లు కుళాయి కనెక్షన్​ లేకుండా ఉండదని అన్నారు. పేదల గురించి గుడిసెల్లో వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చేవారికి వారి బాధలు ఏం తెలుస్తాయని నిలదీశారు. ఇన్నేళ్లలో గుడిసె స్థానంలో ఇళ్లు కట్టి ఇవ్వాలన్న సోయి లేకపోవడం దురదృష్టకరమన్నారు. పేదరిక నిర్మూలనపై తాము చర్చిస్తుంటే వీరికి మాత్రం బోరింగ్​ ఉంటుందని ఆ చర్చల్లో పాల్గొనకుండా, సరైన విధంగా కొనసాగనీయకుండా అడ్డుపడుతుంటారని విమర్శించారు. 

చేతివాటంపై మిస్టర్​ క్లీన్​ ప్రధానే చెప్పారు..
ఒక్కప్పుడు దేశ ప్రధానమంత్రిగా మిస్లర్​ క్లీన్​ అని పిలుచుకునే వ్యక్తి ఉండేవారన్నారు. ఆయనే స్వయంగా కేంద్రం నుంచి రూ. 1 పేదలకు ఇస్తే అందులో కేవలం రూ. 0.15 పైసలు మాత్రమే చేరుతుందని బహిరంగంగానే అన్నారని, తమ పార్టీ చేతి చాకచక్యంపై చక్కగా వివరించారని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని చెప్పారు. పొదుపు, అభివృద్ధిపై తాము ఫోకస్​ పెట్టామన్నారు. జన్​ ధన్​, ఆధార్​, మొబైల్​ మాధ్యమంగా నేరుగా నిరుపేదల చెంతకే నయాపైసా అవినీతి లేకుండా చేర్చగలుగుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ. 40 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

స్వచ్ఛతపై విమర్శించారు.. రూ. 2300 కోట్ల ఆదాయం తెచ్చి చూపాం..
కాంగ్రెస్​ హయాంలో 10 కోట్ల మంది లబ్ధిదారులు అనర్హులే అన్నారు. వారందరి పేర్లను తొలగించి అర్హులైన నిరుపేదల చెంతకు సహాయాన్ని అందించామన్నారు. దీంతో రూ. 3 లక్షల కోట్లు తప్పుడు చేతుల్లో వెళ్లకుండా అడ్డుకోగలిగామన్నారు. చివరకు దేశంలో స్వచ్ఛతా కార్యక్రమాలను కూడా ఎగతాళి చేసిన నీచ చరిత్ర వీరిదని మోదీ మండిపడ్డారు. చెత్తను సేకరించి అమ్మడం ద్వారా రూ. 2,300 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. చెత్తపై ఎగతాళి చేసిన వీరికి ఈ ఆదాయం చూసి తోకముడుచుకున్నారని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.