ఉద్యోగ సంఘాలకు పూర్తి మద్ధతు

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Aug 22, 2025 - 20:25
 0
ఉద్యోగ సంఘాలకు పూర్తి మద్ధతు
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ
నిజాంకు వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్​ పోరాటం ఎనలేనిది
వీధి లైట్లు ఎక్కడ వెలుగుతున్నాయో పరిశీలించాలి
కనీస సౌకర్యాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం
భాగ్యనగరంపై ఇంత నిర్లక్ష్యమా?
నా తెలంగాణ, హైదరాబాద్​: సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని, ఉద్యోగస్థులకు, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, ఉద్యోగ సంఘాలకు బీజేపీ పూర్తి మద్ధతు ఉంటుందని, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన షోయబుల్లాఖాన్​ ధైర్య సాహసాలు ఎనలేనివని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం మీడియా సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా ఇమ్రోజ్​ అనే పత్రిక ద్వారా  షోయబుల్లాఖాన్​ తెలంగాణ సమాజాన్ని మేల్కోల్పారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. షోయబుల్లాఖాన్​ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను, చూపించిన తెగువను స్మరించుకుంటూ బీజేపీ, తెలంగాణ ప్రజల తరఫున నివాళులర్పిచారు.  
 
ఏకైక కలం పోరాట వీరుడు షోయబుల్లా ఖాన్​..
ఖాసీం రజ్వీ అనుచరులు షోయబుల్లాఖాన్​ బెదిరించినా ప్రాణాలను లెక్కచేయకుండా తన కలం ద్వారా పోరాటం చేసి పాత్రికేయ సమాజానికి వన్నె తీసుకువచ్చారని ప్రశంసించారు. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ చొరవతో సైనిక చర్య ద్వారా హైదరాబాద్​ నిజాం రాజ్యం భారత్​ లో విలీనమైందన్నారు. సెప్టెంబర్​ 17న తెలంగాణ లిబరేషన్​ డే ను ఈ సంవత్సరం కూడా హైదరాబాద్​ లో కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 
 
మున్సిపల్​ డివిజన్​ కు 50 లైట్లిస్తారా?..
గతంలో టీఆర్​ఎస్​, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం మాటలు కోటలు దాటాయే తప్ప వీరు చేసిన పనులు మాత్రం నామమాత్రమే అన్నారు. వీధిలైట్లు వెలగని నగరంగా హైదరాబాద్​ ఉందన్నారు. ప్రధాన రహదారుల్లో కూడా ఎందుకు వెలగడం లేదన్నారు. బీజేపీ ఈ అంశంపై ధర్నా చేస్తే మున్సిపల్​ డివిజన్​ లో 50 లైట్లు మాత్రమే ఇస్తామని చెప్పారని, డివిజన్​ లో ఐదువేల లైట్ల అవసరం ఉంటుందని వారికి తెలియదా? అని మండిపడ్డారు. రాత్రి 8 తరువాత ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయో ఒక్కసారి పరిశీలించాలని విలేఖరులకు విజ్ఞప్తి చేశారు. 
 
హైదరాబాద్​ కు కేటాయింపులెన్ని?..
ప్రస్తుతం హైదరాబాద్​ నగరం అనాథగా మారిపోయిందన్నారు. మాదాపూర్​, హైటెక్​ సిటీలే కాదన్నారు. వచ్చిన ఆదాయం ఇక్కడే ఖర్చు పెడుతూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ ఆదాయంలో 70 శాతం హైదరాబాద్​ నుంచే సమకూరుతుందని, మరి కేటాయింపులు ఎంత? అని ప్రశ్నించారు. కనీస రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, పార్కులు, వర్షపు నీరు వెళ్లే స్ర్టామ్​ వాటర్​ పైపు లైన్లు ఇలాంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. 
 
బీజేపీ కార్పొరేటర్లకు మైక్​ లు కూడా ఇవ్వరా?..
బీజేపీ కార్పొరేటర్లు జనరల్​ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్​ ఇవ్వరని, తూతూ మంత్రంగా జీహెచ్​ ఎంసీ సమావేశాను నిర్వహిస్తున్నారని అన్నారు. 150 మందిలో డివిజన్​ లో సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా బడ్జెట్​ పాస్​ చేసుకొంటున్నారని విమర్శించారు. విశ్వనగరమని కేటీఆర్​, దానికంటే ఎక్కువని రేవంత్​ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. పెట్టుబడులు మెండుగా వస్తున్న నగరానికి కనీస సౌకర్యాలు కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్​ లో 30 శాతం మంది జనాభా ఉంటున్నారని, ప్రతీరోజు 15 లక్షల మంది నగరానికి రాకపోకలు కొనసాగిస్తుంటారని చెప్పారు. 
 
కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయరా?..
జీహెచ్​ ఎంసీ, మెట్రో వాటర్​ వర్క్స్​ లకు నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలలు, సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని కారణంగా ధర్నాలు చేసే పరిస్థితి దాపురించిందన్నారు. జీహెచ్​ ఎంసీ జారీ చేస్తున్న టెండర్లకు ముందుకు వచ్చేందుకు ఏ ఒక్క కాంట్రాక్టర్​ సాహసించడం లేదన్నారు. 
 
ప్యాంట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదు..
జూబ్లీహిల్స్​ లో ప్యాంట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదన్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందన్నారు. పౌర సమస్యల పరిష్​కారానికి మీ ప్రాధాన్యత ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం స్వయంగా మున్సిపల్​ వ్యవహారాలను చూస్తున్నారన్నారు. తానెవరినీ రాజకీయపరంగా విమర్శించలేదన్నారు. బీజేపీ నాయకులను తిట్టినంత మాత్రన పనులు చేశామనే ఫీలింగ్​ లో ఉన్నారని విమర్శించారు. తిరిగి తిట్టడంతో బాధ్యత నెరవేరదని, చేయాల్సిన పనులు చేయాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. 
 
సమస్యలపై నిలదీస్తే అరెస్టులా?..
సచివాలయం వద్ద ధర్నా చేస్తే ఉదయం నుంచే పోలీసులను పంపి ఇళ్ల వద్ద నుంచి అరెస్టు చేశారని, ఇంత భయం ఎందుకని నిలదీశారు. హైదరాబాద్​ నగర ప్రజల కష్టాలు, సమస్యలను అందరి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తమకుందన్నారు. మెజార్టీ స్థానాలను బీజేపీకి అందించారని, వారి కష్టాలు, సమస్యలపై నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 
 
బీఆర్​ఎస్​, కాంగ్రెస్ నేతలవి​ భూములపై హోల్​ సేల్​ వ్యాపారాలే..
అనేకమంది బీజేపీ నేతలను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా భూముల వ్యాపారం మాత్రం ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా జరుగుతోందని ఆరోపించారు. బీఆర్​ఎస్ కేసీఆర్​ కుటుంబం, ప్రస్తుతం కాంగ్రెస్​ నాయకులు ప్రైవేట్​ లిమిటెడ్​, హోల్​ సేల్​ గా ఎవరి కోటాలు వారికే అన్నట్లుగా కొనసాగుతుందని ఆరోపించారు. 
 
తెలంగాణ పోరాటంలో ఉద్యోగుల పాత్ర కీలకం..
తెలంగాణ రాష్​ర్ట సాధనలో చివరి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులలో విద్యార్థులు, ఉద్యోగులు ప్రముఖ స్థానంలో ఉన్నారన్నారు. 1969లో 369 మందిపై తుపాకులు ఎక్కుపెట్టారని, పసిపిల్లలని చూడకుండా జై తెలంగాణ అన్న పాపానికి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్​ పార్టీదని మండిపడ్డారు. చివరిదశ ఉద్యమంలో కూడా వీరిది కీలక పాత్రగా ఉందన్నారు. 40 రోజులపాటు ఉద్యోగస్థులు సకల జనుల సమ్మెతో ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రజలంతా చూశారన్నారు. సాధించుకున్న తెలంగాణలోనైనా తమ భవిష్యత్​ బాగుంటుందని కీలకపాత్ర పోషించి స్ఫూర్తిగా నిలబడి పోరాటం చేశారని కొనియాడారు. 
 
ఇచ్చిన హామీలేమయ్యాయి?..
తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఉద్యోగస్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఉద్యోగస్తులందరికీ అభయహస్తం ద్వారా డీఏలను చెల్లిస్తామన్నారని గుర్తు చేశారు. ఇంతవరకు దిక్కూ దివానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్​ ప్రకారం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీఆర్సీ, కరవు భత్యాలు చెల్లించడం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏ రకమైన సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పీఆర్సీపై కేసీఆర్​ కాలం గడిపి గడిపి వెళ్లిపోయారని, కాంగ్రెస్​ పార్టీ కూడా ఏం తక్కువ తినలేదన్నారు. కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు అందజేస్తామన్న హామీని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. ఉద్యోగులకు హెల్త్​ కార్డులు, సీపీఎస్​ రద్దు, ఓల్డ్​ పెన్షన్​ విధానం అమలు, సప్లిమెంటరీ బిల్లులను 15 పనిదినాలలో చెల్లిస్తామని అన్నారని, ఇంకా 15 రోజులు కాలేవా? అని నిలదీశారు. గతంలో మూడు కరవు భత్యాలు చెల్లించకుండా వాయిదా వేశారని అన్నారు. 
 
పే రివిజన్​ నివేదికేది?..
కాంగ్రెస్​ పార్టీ పాలనలో మరో మూడు మొత్తం ఆరు కరవు భత్యాలు అయ్యాయని అన్నారు. ఒక కరువు భత్యం 28 వాయిదాలలో చెల్లిస్తామని అంటున్నారని వివరించారు. కాంగ్రెస్​ హయాంలో ఈ చెల్లింపులు పూర్తి కావన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. రెండేళ్లుగా కరవు భత్యం అందించలేదన్నారు. పే రివిజన్​ కమిటీ ఉందా? లేదా? అన్నది ఎవరికీ తెలియదన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలన్నారు. 2022లో ఏర్పాటు చేస్తే ఇప్పటివరకూ నివేదిక రాకపోవటం ఏంటని నిలదీశారు. ఉద్యోగస్థులకు ఆరోగ్య భద్రతకు గండికొట్టారని, మెడికల్ రీ యింబర్స్​ మెంట్​ అమలులో ఉందా? లేదా? తెలియదన్నారు. కేసీఆర్​ క్యాష్​ లెస్​ కాస్త క్యాష్​ ‘లెస్​’..గానే మారిందన్నారు. పదవీ విరమణ ఉద్యోగస్థుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు. పెన్షన్​, పీఎఫ్​ లు తదితరాలు సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ విషయంలో 30 రోజుల్లో వారికి అందాల్సిన అన్ని బకాయిలను చెల్లించాలని స్పష్టంగా చెప్పిందని, ఆచరిస్తుందని అన్నారు. ఉద్యోగస్థులు దాచుకున్న డబ్బును కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందన్నారు. వారికి వచ్చే డబ్బులపైన కూడా మారిటోరియం విధించడం దుర్మార్గమన్నారు. 
 
63 సమస్యలపై 200 ఉద్యోగ సంఘాల జేఏసీకి పూర్తి మద్ధతు..
63 దీర్ఘకాలిక పెండింగ్​ సమస్యలపై ఉద్యోగ సంఘాలు రాష్​ర్ట ప్రభుత్వానికి నోటీసులిచ్చాయన్నారు. 200 సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి వారందరూ హక్కుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఉద్యోగస్థులకు ప్రభుత్వం బకాయిపడిందన్నారు. వారి కష్టార్జితాన్ని సైతం ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. ఈ సంఘాలకు బీజేపీ తమ పూర్తి మద్ధతు ప్రకటిస్తుందన్నారు. వెంటనే రాష్​ర్ట ప్రభుత్వం భే షరతుగా ఎలాంటి చర్చలు లేకుండా, కాంగ్రెస్​ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగస్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్​ చేశారు.