స్వావలంభనే దేశ విధానం
దేశాభివృద్ధిపై రాజీపడం
జీఎస్టీపై తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాలు
యూపీలో పెట్టుబడులు సురక్షితమే
ప్రతీఒక్క వ్యాపారి స్వావలంభన దిశగా అడుగులేయాలి
ఇండియా ఎక్స్ పో వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన ప్రధాని
లక్నో: భారత్ ఎవరిపైనా ఆధారపడేందుకు సిద్ధంగా లేదని స్వావలంభనే దేశ విధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇతరులపై ఆధారపడితే దేశాభివృద్ధిపై రాజీ పడాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టి, శ్లాబులను తగ్గించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కొత్త జీఎస్టీ ధరలపై దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు. 2014కి ముందు వారు నడిపిన ప్రభుత్వ వైఫల్యాలను దాచడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. వాస్తవంగా కాంగ్రెస్ పాలనలో పన్నుల దోపిడీ విపరీతంగా జరిగిందని, దోచుకున్న డబ్బును దాచుకున్నారని, సాధారణ పౌరులపై అధిక పన్నుల భారం మోపారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం అలా జరగనీయబోదన్నారు. రూ. 1000 ఖరీదు చేసే వస్తువులపై రూ. 117 పన్ను ఉండేదన్నారు. ప్రస్తుతం దాన్ని రూ. 1000 వస్తువుపై రూ. 35కు తగ్గించామన్నారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీలో 55 శాతం యూపీలోనే తయారవుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితం చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. సీఎం యోగి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు.
గురువారం ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో మార్ట్ లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన---–2025ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ప్రారంభించిన స్టాళ్లను సందర్శించి పలువురితో ముచ్చటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
చిప్స్ నుంచి ఓడల వరకు దేశంలోనే రూపోందించాలి..
చిప్స్ నుంచి ఓడల వరకు దేశంలోనే తయారు చేయాలన్నది తమ బలమైన సంకల్పమన్నారు. ఇక తయారీ రంగంలో ఎవరిపై ఆధారపడడాన్ని ఆమోదించబోమని కుండబద్ధలు కొట్టారు. ఇక్కడ (యూపీ) పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు తమ వ్యాపార నమూనాను బలోపేతం చేసుకోవచ్చని అభయమిచ్చారు. దీంతో స్వదేశీ స్వావలంభన చేకూరుతుందన్నారు. దేశం ఇకపై ఎవ్వరిపై ఆధారపడకూడదని నిర్ణయించిందన్నారు. 2014కు ముందు ఆదాయపు పన్ను మినహాయింపు రూ. 2 లక్షల వరకే పరిమితం అయ్యిందని, ప్రస్తుతం రూ. 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చామన్నారు. నూతన జీఎస్టీ సంస్కరణ వల్ల ప్రజల రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేయబోతున్నామని మోదీ స్పష్టం చేశారు.
జీఎస్టీ తగ్గింపు ఎంఎస్ ఎంఇ రంగాలకు మరింత ఊతం..
జీఎస్టీ సులభతరంతో ఎంఎస్ఎంఇ రంగాలకు వేగంగా రిటర్న్ లు అందుతాయన్నారు. 2014కు ముందు ఎప్పుడు పన్నులను సమతుల్యం చేసే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ మొబైల్ తయారీ 55 శాతం ఉత్పత్తి అవుతుందన్నారు. సెమీ కండక్టర్ రంగంలో కూడా భారత్ స్వావలంభన దిశగా అడుగులు వేస్తుందన్నారు. త్వరలో ఇక్కడ సెమీకండక్టర్ పై పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులు యూపీలో పెట్టుబడుల నెట్ వర్క్ ను నిర్భయంగా మరింత విస్తృతం చేసుకోవచ్చన్నారు.ఇక్కడ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, సీఎం యోగి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతులకు ఆస్కారం కల్పించేందుకు రవాణా వ్యవస్థ బలోపేతం అయిందని వివరించారు. ఎక్స్ ప్రెస్ హైవేలు, విమానాశ్రయాలు, రైల్వేల నెట్ వర్క్ పటిష్టమైందన్నారు. నమామిగంగే వంటి ప్రాజెక్టులు యూపీ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు.
స్వదేశీ ఉత్పత్తులను కోరుకుంటున్న సాయుధ దళాలు..
సాయుధ దళాలు స్వదేశీ ఉత్పత్తులను కోరుకుంటున్నాయని, ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయన్నారు. అందువల్ల, భారతదేశంలో ఒక శక్తివంతమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ద్వారా ప్రతీ ఆయుధాన్ని రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు, ఎగుమతులు చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. అలాంటి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నామని, ఇందులో ఉత్తరప్రదేశ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. జెమ్ (జీఇఎం) పోర్టల్ ద్వారా దాదాపు 2.5 మిలియన్ల మంది విక్రేతలు, సేవా ప్రదాతలు నమోదు చేసుకున్నారని, ప్రభుత్వానికి నేరుగా వస్తువులు, సేవలను సరఫరా చేస్తున్నారని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా రూ.15 లక్షల కోట్ల విలువైన వస్తువులు, సేవలు లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువైన వస్తువులు, సేవలను ప్రత్యేకంగా ఎంఎస్ఎంఇల నుంచి కొనుగోలు చేశారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు నెలకొన్నా భారత దృష్టిని మరల్చలేవని వాటికి పరిష్కార మార్గాలను కనుగొని మరింత మున్ముందుకు ప్రయాణిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో రష్యా భారత్ భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
అట్టడుగు వర్గాల శ్రేయస్సుకు దీన్ దయాళ్ కృషి ఎనలేనిది..
మేక్ ఇన్ ఇండియా ప్రాధాన్యతపై ప్రతీ ఒక్క పెట్టుబడిదారుడు వ్యాపార నమూనాను అభివృద్ధి చేయాలని కోరుతున్నానన్నారు. స్వదేశీ వస్తువులను వీలైనంత ఎక్కువగా రూపొందించాలన్నారు. 2047 నాటికి భారత్ స్వావలంభన దిశలో అభివృద్ధి చెందిన మార్గంలో పూర్తిగా పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించారు. అట్టడుగు వర్గాల వారి కోసం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అభివృద్ధి ఫలాలు అత్యంత పేదవారికి చేరాలన్నదే తమ అభిమతమని, ఇందులో ఎలాంటి వివక్షతకు తావులేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.