3 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jul 19, 2025 - 17:02
 0
3 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ తో కలిసి కాజీపేట రైల్వే పనుల పర్యవేక్షణ
ఏం ఇచ్చారు? ఏం తెచ్చారు? అనే వారు కళ్లు తెరుచుకు చూడాలి
రైల్వేల అభివృద్ధికి మోదీ, కేంద్రమంత్రి వైష్ణవ్​ కు నిబద్ధతలకు కృతజ్ఞతలు
నా తెలంగాణ, వరంగల్​: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్​ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తారనడానికి ఇది మరో నిదర్శనంగా పేర్కొన్నారు. శనివారం వరంగల్​ లోని కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్​ పనులను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ తో కలిసి కిషన్​ రెడ్డి పర్యవేక్షించారు. జరుగుతున్న పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 
 
అభివృద్ధి పనులను స్వయంగా చూడాలి..
ప్రధాని మోదీ ఏం ఇచ్చారు? ఏం తెచ్చారు? అని ప్రశ్నించే వారు కళ్లు తెరిచి చూడాలని, చెవులుంటే వినాలని అన్నారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని కోరారు. కేంద్రమంత్రి వైష్ణవ్​ పనులను పర్యవేక్షించడం, రైల్వేల అభివృద్ధిపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు. వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేల విస్తరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్రమంత్రి తెలంగాణ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. వరంగల్​ ప్రజలు, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ లకు హృదయపూర్వక కృతజ్ఞతలను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. 
 
ఎయిర్​ పోర్ట్​ కు భూమినివ్వండి..
వరంగల్‌లో రింగ్‌రోడ్‌లో 50 శాతం పనులు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు, వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించామని చెప్పారు. వరంగల్​ ఎయిర్​ పోర్ట్​ కోసం అవసరమైన భూమిని రాష్ర్ట ప్రభుత్వం సివిల్​ ఏవియేషన్​ మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.