శిథిలావస్థ భవనాలను పునర్నిర్మించాలి

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

Aug 30, 2025 - 13:49
Aug 30, 2025 - 14:21
 0
శిథిలావస్థ భవనాలను పునర్నిర్మించాలి
పలు ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్​ క్లీనింగ్​ మిషన్ల అందజేత
పారిశుద్ధ విషయంలో నిర్లక్ష్యం వద్దు
రాష్ర్ట ప్రభుత్వం శానిటేషన్​ సిబ్బందిని నియమించాలి
టాయిలెట్స్​ లేక డ్రాపౌట్స్​ పెరుగుతున్నాయి
ఉన్నత ప్రమాణాలున్న ఉపాధ్యాయులు మన సొంతం
బుద్ధిగా చదువుకొని అందరికీ పేరు తేవాలి
ఉన్నత విద్యావంతుల అవకాశాలకు కొదవలేదు
నా తెలంగాణ, హైదరాబాద్​: నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటి పారిశుద్ధ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. 
 
శనివారం సికింద్రాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గంలోని జీహెచ్​ ఎస్​ అదయ్య మెమోరియల్​ రాణిగంజ్​, గవర్నమెంట్​ హై స్కూల్​ కలాసిగూడా, పార్క్​ లేన్​, నల్లగుట్ట, ఆర్పీరోడ్​ లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్స్​ క్లీనింగ్​ మిషన్స్​ ను అందజేశారు. 
 
ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో 21 నూతన పాఠశాల భవనాలను నిర్మించానని గుర్తు చేశారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల  కల్పన మెరుగుపర్చాలన్నారు. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్​ లేకపోవడంతో పిల్లల డ్రాపౌట్స్​ పెరుగుతున్నాయని, పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి బడ్జెట్​ లో నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని, వారిలో నైపుణ్యాన్ని, నైతిక విలువలను పెంచేదే విద్య అని స్పష్టం చేశారు. ఇది వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని విద్యార్థులు చక్కగా చదవుకొని ఉన్నతస్థానానికి ఎదగాలన్నారు. ప్రైవేట్​ పాఠశాలలకు ధీటుగా పాఠాలు బోధించే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ప్రభుత్వ ఉపాధ్యాయులదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నామని బాధపడొద్దన్నారు. మహాత్మాగాంధీ, అబ్దుల్​ కలాం లాంటివారెందరో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని దేశానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యావంతులైతే దేశంలో ఉద్యోగాలకు కొరత లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్​ సెక్టార్​ లలో అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. విద్యార్థులు బుద్ధిగా చదువుకొని, పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి విద్యార్థులకు సూచించారు.