ధర్మస్థల కేసు.. ఫిర్యాదుదారుడు యూటర్న్!
Dharmasthala case.. Complainant makes a U-turn!
ఆరోపలన్నీ అవాస్తవాలని ఒప్పుకున్న చిన్నయ్య
బీఎన్ఎస్ సెక్షన్ 183 కింద వాంగ్మూలం నమోదు
బెంగళూరు: ధర్మస్థల కేసు కీలకమలుపు తీసుకుంది. శనివారం బెల్తంగడిలోని అదనపు కోర్టు ముందు ప్రధాన ఫిర్యాదుదారుడు చిన్నయ్య యూటర్న్ తీసుకున్నాడు. తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన మేజిస్ర్టేట్ నివేదికలు ఆదివారం మీడియాకు లభించడంతో మేజిస్ర్టేట్ ముందు జరిగిన పరిణామాలు బయటి ప్రపంచానికి వెలుగుచూశాయి. ఇతరుల బలవంతం మేరకే లైంగిక దాడి, హత్య, ఖననం వంటి కల్పిత కథనాలను అల్లినట్లు ఒప్పుకున్నాడు. ఇతని వాంగ్మూలాన్ని భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 183కింద నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నయ్య శివమొగ్గ జైలులో ఉన్నాడు. అత్యంత గోప్యంగా శనివారం ఇతన్ని మేజిస్ర్టేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా అసత్య ఆరోపణల నేపథ్యంలో సిట్ అతన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా చిన్నయ్యను బలవంత పెట్టిందెవరనేది బయటికి రాలేదు. పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలోని పేర్లను వెల్లడించలేదు. అయితే చిన్నయ్య గతంలో మానవ పుర్రెను అందించి ఈ ఆరోపణలకు ఊతం కల్పించాడు. ఆ పుర్రెను సౌజన్య మామ విఠల్ గౌడ తనకు అప్పగించాడని కోర్టులో వెల్లడించాడు. దీంతో సిట్ దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. సాక్షి యూటర్న్ తీసుకోవడంతో కేసు విశ్వసనీయతకు దెబ్బగా పలువురు అభివర్ణించారు. కాగా ఈ కేసుపై గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషనర్ కు మొట్టికాయలు వేసి స్థానిక కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.