అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు

మిజోరాంలో ప్రధాని నరేంద్ర మోదీ

Sep 13, 2025 - 13:19
Sep 13, 2025 - 13:20
 0
అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు
బైరాబి సైరాంగ్​ ప్రాజెక్టు ప్రారంభం
ఇంజనీరింగ్​, కార్మికుల శ్రమకు అద్భుతమైన ప్రాజెక్టు
ప్రధాన స్రవంతిలోకి ప్రజలను తీసుకువచ్చాం
ఈశాన్యం సమ్మిళిత అభివృద్దికి చిహ్నం
త్వరలో హెలికాప్టర్​ సేవలు
జీఎస్టీతో ప్రతీ ఒక్కరికీ మేలు, ఆర్థిక స్వావలంభన
ఐజ్వాల్​: ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తమకు తక్కువ సీట్లు లభించాయన్న కారణంతో ఆ ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలను, ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని వివరించారు. సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితుల్లోనూ, అనేక అడ్డంకులను అధిగమించి నేడు ఇంజనీర్లు, కార్మికుల శ్రమ వల్ల 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్నవంతెనలతో కూడిన ప్రాజెక్టు కలను సాకారం చేసుకున్నాని ఇదో ఇంజనీరింగ్​ అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 51 కి.మీ. పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ మిజోరాంను ఢిల్లీ, గౌహతి, కోల్‌కతాకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని కల్పించింది. దేశంలో రెండో పైర్ వంతెన కూడా ఉంది. ఇది 114 మీటర్ల ఎత్తు, ఇది కుతుబ్ మినార్ (72 మీటర్లు) కంటే కూడా ఎక్కువ.
 
ఐజ్వాల్​ కు తొలి రైల్వే కనెక్టివిటీ..
శనివారం మిజోరంలోని ఐజ్వాల్​ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బైరాబి సైరాంగ్​ ప్రాజెక్టును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రూ. 9వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వాతావరణం అననుకూలత వల్ల లెంగ్​ పుయ్​ విమానాశ్రయం నుంచే వర్చువల్​ గా ప్రజనుద్దేశించి ప్రసంగించారు. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన మిజోరం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బైరాబి సైరాంగ్​ నూతన రైల్వే ప్రాజెక్టు రూ. 8,070 కోట్ల విలువైనది. ఇది మిజోరాం రాజధాని ఐజ్వాల్​ కు తొలి రైల్వే కనెక్షన్​ ను సూచిస్తుంది. ఈశాన్య ప్రాంతానికి చారిత్రాత్మక మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధికి చిహ్నంగా ప్రశంసించారు. 
 
పరివర్తనకు జీవనాడి మిజోరాం..
ఈ రైల్వే కనెక్షన్​ కేవలం రవాణా మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, మిజోరాం పరివర్తనకు జీవనాడి అని, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, రవాణా ఉపాధిని పెంచుతుందన్నారు. గత 11 ఏళ్లును తమ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తూ సాధించిన విజయాలను ప్రస్తావించారు. గ్రామీణ రోడ్లు, హైవేలు, ఇంటర్నెట్​ కనెక్టివిటీ, విద్యుత్​, ఎల్పీజీ, కుళాయి నీరు, ఉడాన్​ ఎయిర్​ కనెక్టివిటీ పథకం ద్వారా మిజోరాం ప్రయోజనం పొందుతుందని, హెలికాప్టర్​ సేవలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. భారతీయ రైల్వే నెట్​ వర్క్​ కు ఐజ్వాల్​ అనుసంధానమైందని, సైరాంగ్​ రాజధాని ఎక్స్​ ప్రెస్​ ఢిల్లీకి అనుసంధానించామన్నారు. 
 
ఆర్థిక వ్యవస్థకు ఇంధనం ‘ఖేలో ఇండియా’..
యాక్ట్ ఈస్ట్​ పాలసీ, ఎమర్జింగ్​ నార్త్​ ఈస్ట్​ ఎకనామిక్​ కారిడార్​ లలో మిజోరాం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కలడాన్​ మల్టీమోడల్​ ట్రాన్స్​ పోర్ట్​, సైరాంగ్​ హ్మాంగ్​ బుచువా రైలు మార్గం వంటి ప్రాజెక్టులు మిజోరాంను బంగాళాఖాతం, ఆగ్నేయాసియాకు అనుసంధానించేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీంతో వాణిజ్యం, పర్యాటకం మరింత పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిభావంతులైన యువకులున్నారని మోదీ ప్రశంసించారు. ఇప్పటికే ఇక్కడ 11 ఎకలవ్య రెసిడెన్షియల్​ పాఠశాలలు ఉన్నాయని, వీటికి తోడు మరో ఆరు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 4500 స్టార్టప్​ లు, 25 ఇంక్యుబేటర్లు చురుకుగా పనిచేస్తున్నాయని, పెరుగుతున్న ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థను ఇవి ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని చెప్పారు. మిజోరాం క్రీడా సంప్రదాయాన్ని ఫుట్​ బాల్​ ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఖేలో ఇండియా’ కింద రాష్​ర్టం ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను దక్కించుకుందన్నారు. దీంతో యువత మరింత శక్తివంతంగా మారేందుకు తోడ్పడిందన్నారు. క్రీడా వ్యవస్థ రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా నిలుస్తుందని చెప్పారు. 
 
మేడ్​ ఇన్​ ఇండియాతో ఆర్థిక స్వావలంభన..
వెదురు, సేంద్రీయ అల్లం, పసుపు, అరటిపండ్లు వంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించాలని జీఎస్టీ సంస్కరణలను చేపట్టామన్నారు. దీని ఫలాలు దేశవ్యాప్త ప్రజలకు లభించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 27 శాతం ఉన్న పన్ను ఇప్పుడు కేవలం 5 శాతానికి పరిమితం చేశామన్నారు. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ, సిమెంట్​, ప్రయాణం, ఆతిథ్యం వంటి రంగాలు మరింత అభివృద్ధి చెందనున్నాయని, ఇది ప్రజలతోపాటు, వ్యాపారుల ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరుస్తుందన్నారు. 2025–26 తొలి త్రైమాసికంలో 7.8 జీడీపీ వృద్ధిని ఉదహరించారు. మేడ్​ ఇన్​ ఇండియా ద్వారా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ వృద్ధిని సాధిస్తుందన్నారు. ఆపరేషన్​ సిందూర్​ ను ప్రస్తావిస్తూ దేశీయ ఆయుధాలు కీలకపాత్ర పోషించాయన్నారు. భారతదేశ వృద్ధి నిర్మాణంలో మిజోరాం కీలక భాగస్వామిక పోషిస్తుందని ఆశించారు. జాతీయ ఐక్యత, ఆర్థిక సాధికారత, ప్రాంతీయ సమ్మిళితత్వం విస్తృత దృక్పథంతో కలిసి ముందుకు వెళదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతాలన్నింటినీ దేశాభివృద్ధికి ఇంజిన్​ లా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ స్పష్టం చేశారు. 
 
ప్రత్యేకతలు..
– మిజోరాం మొదటిసారిగా గౌహతి, ఢిల్లీ, కోల్‌కతాలకు అనుసంధానించినట్లయ్యింది. సైరంగ్ నుంచి ఢిల్లీ రైలుతో, ఈ రాష్ట్రం ఇప్పుడు నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానించారు. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 2,510 కి.మీ ప్రయాణాన్ని 45 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. సగటు వేగం గంటకు 57.81 కి.మీ.
 
– సైరంగ్-– కోల్‌కతా రైలు వారానికి 3 రోజులు నడుస్తుంది. కోల్‌కతా – సైరంగ్ మధ్య 1,530 కి.మీ దూరాన్ని 31.15 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలు వారంలో శనివారం, మంగళవారం, బుధవారం నడుస్తుంది. రైలు సగటు వేగం గంటకు 48.96 కి.మీ. 
- సైరంగ్-–గౌహతి రైలు మధ్యాహ్నం 12:30 గంటలకు సైరంగ్ నుంచి బయలుదేరుతుంది. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటలకు గౌహతి చేరుకుంటుంది. దీనితో పాటు, సైరంగ్ నుంచి ఒక గూడ్స్ రైలు కూడా బయలుదేరి దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతుంది.