నైపుణ్యాలను తొక్కిపెట్టిన కాంగ్రెస్
శత్రువును ఓడించేందుకు ఐక్యంగా పనిచేయాలి
దేశ భవిష్యత్ ను ఫణంగా పెట్టలేం
సముద్ర సే సమృద్దిలో ప్రధాని మోదీ
బ్రిటిష్ చట్టాలను మార్చాం
భూమ్యాకాశ రంగాలను సంస్కరించాం
గాంధీనగర్: మన అతిపెద్ద శత్రువు ఇతరులపై ఆధారపడటమేనని ఇదే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనం స్వావలంభన దిశగా వందలాది సమస్యలకు పరిష్కారాలను వెతుకుదామని మోదీ పిలుపునిచ్చారు. మన శత్రువును ఒడించేందుకు మనమంతా ఐక్యంగా కలిసి పనిచేయాలన్నారు. భవిష్యత్ తరాల భవిష్యత్ ను మనం ప్రమాదంలో పడేయలేమన్నారు. నేడు భారత్ విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. విదేశాలపై ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటే వైఫల్యం అంత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం స్వావలంభన కలిగి ఉండాలన్నారు. దేశ భవిష్యత్ ను ఫణంగా పెట్టలేమన్నారు. స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. నైపుణ్యాలకు కొదవలేకున్నా వాటిని కనుమరుగు చేసే, తొక్కి పెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. దీంతో దేశ ప్రజలు అదే భావనలో ఉండిపోయారని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశ ప్రజలు అలాంటి భావనను విడనాడీ తమ శక్తియుక్తులను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ్ నగర్ ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం రూ. 32,400 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ప్రపంచీకరణ యుగం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ దిగుమతుల మార్గాన్నే ఎంచుకుందన్నారు. ఏనాడూ దేశ స్వావలంబనకు కృషి చేయలేదన్నారు. దీంతో దేశంలోని యువత చాలా నష్టపోయారని చెప్పారు. భారత్ నిజమైన బలాన్ని తెరపైకి రాకుండా దుర్భుద్ధిని ప్రదర్శించారని మండిపడ్డారు. అనేక రంగాల్లో భారత్ శక్తియుక్తులను వెలుగులోకి తేకుండా చీకట్లో ఉంచారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందాలంటే, అది స్వావలంబనగా మారాలని మోదీ స్పష్టం చేశారు. వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలను తాము మార్చామన్నారు. సముద్ర రంగం, భూమ్యాకాశ రంగాలను సంస్కరించామన్నారు. దీంతో సముద్ర రంగంలో మార్పు చూస్తున్నామన్నారు.