నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడిపాడారు. శనివారం కలెక్టర్ సంగారెడ్డి జిల్లా సమైక్య ఆధ్వర్యంలో పాత డీఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తికి ఎంతగానో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళల అభ్యున్నతికి, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ మహిళలు ఆర్థికంగా ముందుకు రావాలని, ప్రభుత్వ పథకాల ఉపయోగించుకోవాలని ఆర్ధికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
బతుకమ్మ వంటి పండుగలు మహిళా శక్తిని ప్రదర్శించడానికి, సామాజిక ఐక్యతను మరింతగా పెంపొందించడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని, ఇది ఒక దశాబ్దకాలంగా ప్రత్యేక సంస్కృతిని కలిగిన పండుగగా నిలిచిందని, బతుకమ్మను గొప్ప ఉత్సవంగా నిర్వహించడం ద్వారా మహిళలు, కుటుంబాలు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో పీడీ ఆర్డీవో జ్యోతి, ఏపీవోలు, జిల్లా మహిళా శక్తి సభ్యులు, వివిధ మండలాల మహిళలు హాజరయ్యారు.