కేంద్రం సబ్సిడీని భరిస్తూ అందజేస్తుంది
రూ. 400కు ఎవరు విక్రయిస్తున్నారు?
కళ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు?
దీనివెనుక ఉన్నదెవరు?
2.70 లక్షల మె.టన్నుల బఫర్ స్టాక్ ఎక్కడ?
కృత్రిమ కొరత వాతావరణం ఎందుకు కల్పించారు
నా తెలంగాణ, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ. 2200 నుంచి రూ. 2400 ఉన్న యూరియా బస్తాను రైతుల సంక్షేమం దృష్ట్యా రూ. 265 రూపాయలకు సబ్సిడీని భరిస్తూ అందజేస్తుంటే, రూ. 400కు రాష్ట్రంలో ఎవరు విక్రయిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, బద్నాం చేసే రాజకీయాలను మానుకొని రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రూ. 242 బస్తా, రవాణాతో కలుపుకొని రూ. 265లకు అందజేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ. 400కు విక్రయిస్తుంటే రాష్ర్ట ప్రభుత్వం కళ్లప్పగించి ఎందుకు వేచి చూస్తుందని, దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాల్సిన బాధ్యతా లేదా? అని కేంద్రమంత్రి నిలదీశారు.
50 శాతం ప్రైవేట్ ఏజెన్సీలకు, 50 శాతం రైతులకు కో ఆపరేటివ్ ఏజెన్సీలకు అందజేయాలన్నారు. వచ్చిన యూరియా ఎందుకు పక్కదారి పడుతుందన్నారు. కేంద్రం అందజేస్తున్న సబ్సిడీ ప్రజలు, రైతుల డబ్బే అన్నారు. వర్షాకాలం రాకముందే భూమి దున్నకముందే, విత్తనాల అవసరం రాకముందే ఎరువుల కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద 270 లక్షల మె.టన్నులు గత సీజన్ ఎరువులు బఫర్ స్టాక్ అందుబాటులో ఉన్నాయన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
కొరత అనే భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టించారని నిలదీశారు. విదేశాల్లో నాలుగింతలు ధరలు పెరిగినా మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి ధర పెంచకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షలాది కోట్లు పెట్టి కొనుగోలు చేసి రైతులకు సరసమైన ధరలకే అందజేస్తుందన్నారు. అయినా బ్లాక్ మార్కెటింగ్ ను తెలంగాణలో అడ్డుకోకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కెమికల్ పరిశ్రమలకు యూరియా వెళ్లకూడదని పకడ్భందీ చర్యలు తీసుకుందన్నారు. 24 గంటలు మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిందన్నారు. పెద్ద రైతులు అవసరం మేరకు వాడుకోవాలని, స్టాక్ నిల్వల చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రంలో రాష్ర్ట ప్రభుత్వం సహకరించాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలన్నారు. ఇప్పటికే కేంద్ర విభాగాలు కలిసి అన్ని రాష్ర్టాలతో సమన్వయం చేసుకుంటున్నాయని మోనిటరింగ్ రెగ్యూలర్ గా చేస్తున్నాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వివరించారు.