2070 నాటికి సున్నా ఉద్ఘారాల దిశగా ప్రయాణం
2014 తరువాత మూడురెట్లు పెరిగిన పునరుత్పాదక శక్తి
విద్యుత్ అవసరాల్లో సగం శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి
ఎకనామిక్స్ టైమ్స్ ఎనర్జీ లీడర్ షిప్ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బొగ్గు (నల్లబంగారం), గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన అనేక సంస్కరణ చర్యల వల్ల ఇంధన రంగంలో భారత్ అంతర్జాతీయంగా కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2070 నాటికి సున్నా ఉద్ఘారాల దిశగా భారత్ ను నడిపించాలనే బలమైన సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రతికూలతలను కూడా భౌగోళికంగా అనుకూలంగా మలుచుకుంటున్నామని చెప్పారు. స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో నాలుగు, వాయు పవన విద్యుత్‌లో నాలుగు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నామన్నారు. 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, దేశంలోని విద్యుత్ అవసరాల్లో సగం మేర శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆత్మనిర్బర్ దిశగా ప్రయాణం..
బుధవారం ఢిల్లీలో జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ ఎనర్జీ లీడర్ షిప్ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం అందులో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. గతంతో పోల్చుకుంటే ఇంధన ఎనర్జీ రంగంలో నూతన ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న దృష్ట్యా శక్తి (ఎనర్జీ) అవసరాలు భారీగా పెరగనున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ ద్వారా అంతర్జాతీయంగా ఎదిగేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి వివరించారు. 2014 ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెంచామన్నారు. విద్యుత్ అవసరాల్లో సగం శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ బొగ్గు ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, భవిష్యత్ లో విద్యుత్ భద్రత విషయంలో బొగ్గు ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
2030 నాటికి 15 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..
గతేడాది 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగిందన్నారు. 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై దృష్టి సారించాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఇప్పటికే 1,900 మెగా వాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించామని, 2030 నాటికి 15 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరాలు 2040 నాటికి భారీగా పెరగనున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వదేశీ విధానాన్నే ఖనిజ రంగం, ఇంధన రంగంలో కూడా ఇదే విధానంతో లక్ష్యాన్ని సాధించేందుకు 10ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు.
పారదర్శక వేలం ప్రక్రియకు శ్రీకారం..
2014కు ముందు బొగ్గు, గనుల రంగంలో అవినీతి రాజ్యమేలేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులను సమూలంగా మార్చేశామన్నారు. దేశ సంపద అన్యాక్రాంతం కాకుండా పారదర్శక వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే పలు సంస్థ ఆధ్వర్యంలో దేశం, విదేశాల్లోనూ తవ్వకాలు ప్రారంభించామన్నారు. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ కు రూ. 1,500 కోట్లతో ఇన్సెంటివ్ పథకాన్ని తీసుకువచ్చిమని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అభివృద్ధిని సాధించేందుకు బొగ్గు, గనుల రంగం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై గతంలో ఉన్న సెస్ ను పూర్తిగా ఎత్తేశామని చెప్పారు. దీంతో ప్రజలపై పన్ను భారం తగ్గించి పండుగ కానుక అందించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.