బీఆర్​ఎస్​, కాంగ్రెస్​.. ద్వంద్వ విధానాలు

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jul 18, 2025 - 20:18
 0
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​.. ద్వంద్వ విధానాలు
కోచ్​ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగవంతం
ఎయిర్​ పోర్ట్​ పై ఎందుకు స్పందించలే
భూసేకరణ చేసి నిర్మాణం చేపట్టాలి
కోచ్​ ఫ్​యాక్టరీకి అదనపు నిధులకు కేంద్రం సిద్ధం
గుజరాత్​ కచ్​ వరకు రైలు ఏర్పాటుకు కృషి
ఎంఎంటీఎస్​ ఒప్పందంపై కట్టుబడి లేరెందుకు?
బనకచర్లపై బీఆర్​ఎస్​ అప్పుడొకలా.. ఇప్పుడు మరొకలా
యూరియా కొరత లేకుండా కేంద్రం చూసుకుంటుంది
నా తెలంగాణ, హైదరాబాద్​: వరంగల్​ కాజీపేట కోచ్​ ఫ్​యాక్టరీ వ్యాగన్ల శుభ్రతకే అని బీఆర్​ ఎస్​ (కేసీఆర్​ కుటుంబం) ఆరోపణలు, వరంగల్​ ఎయిర్​ పోర్ట్​ విషయంలో ఎందుకు నిర్మాణాత్మకంగా స్పందించలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి నిలదీశారు. ఎయిర్​ పోర్ట్​ అవసరమని ఎన్నోసార్లు లేఖలు రాశానని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఎయిర్​ పోర్ట్​ నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. శుక్రవారం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రసంగించారు. ఈ రెండు పార్టీల ద్వంద్వ విధానాలను తూలనాడారు. 
 
నిరంతరం పనుల పర్యవేక్షణ..
పీవీ హయాం నుంచి వరంగల్​ కోచ్​ ఫ్యాక్టరీ కావాలని కోరుతూ అనేక పోరాటాలు గతంలో జరిగాయన్నారు. పార్లమెంట్​ లోనూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కోచ్​ ఫ్​యాక్టరీ సమస్య పరిష్​కార దశలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ భూమిపూజ, 60 నుంచి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. మోదీ ఆదేశాల మేరకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. తానే స్వయంగా నిర్మాణ పనుల పురోగతిని ప్రతీ 10–15 రోజులకోమారు పర్యవేక్షిస్తున్నానని కేంద్రమంత్రి వివరించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ కూడా తెలంగాణకు వచ్చి పనుల పురోగతిని పరిశీలించారని చెప్పారు. ఇప్పటికే రూ. 521 కోట్లు మంజూరు చేశామని, అదనంగా మరో రూ. 200 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. నిధుల విషయంలో వెనకాడొద్దని ప్రధాని ఆదేశాలున్నాయని చెప్పారు. పూర్తి స్థాయి మ్యాన్యూఫ్​యాక్చరింగ్​ పరిశ్రమగా తయారవుతుందని చెప్పారు. హైదరాబాద్​ తరువాత వరంగల్​ ప్రముఖ నగరంగా పారిశ్రామికంగా కలిసివచ్చే అంశమన్నారు.
 
ప్రగతి భవన్​ లో విమర్శలకే పరిమితం..
ఒక మెగా టెక్స్​ టైల్​ పార్కును వరంగల్ కు తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్​ తోపాటు వరంగల్​, నిజామాబాద్​, కరీంనగర్​ లాంటి రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమకున్న దృక్పథంగా కిషన్ రెడ్డి వివరించారు. కానీ రాష్​ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎయిర్​ పోర్ట్​ విషయంలో కేంద్రమంత్రి కేసీఆర్​ తో ప్రగతి భవన్​ లో మాట్లాడారని ఆయన కేవలం విమర్శలకే పరిమితమయ్యారని నిర్మాణాత్మకంగా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. వరంగల్​ రింగు రోడ్డు పనుల్లో 50 శాతం కేంద్రం పూర్తి చేసిందని, మిగతా పనులను రాష్​ర్ట ప్రభుత్వం ఎప్పుడు చేపడుతుందని ప్రశ్నించారు. కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఉత్పత్తి వచ్చే ఏడాది నుంచే జరుగుతుందని చెప్పారు. దీంతో శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దీనికి అనుబంధంగా ప్రైవేట్ స్టార్టప్‌లు, హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్, మెటీరియల్ సప్లయర్లు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, ఆటో మెకానిక్ వర్క్‌షాప్లు మొదలవుతాయని, ఈ పరిశ్రమ వరంగల్ అభివృద్ధికి ఆర్థికంగా బలంగా నిలుస్తుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్​–జోధ్​ పూర్​ ట్రైన్​ సదుపాయం తీసుకువచ్చానని చెప్పారు. అహ్మాదాబాద్​ రైల్వే స్టేషన్​ అభివృద్ధి పూర్తయ్యాక హైదరాబాద్​ నుంచి గుజరాత్​ కచ్​ వరకు ట్రైన్​ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని వివరించారు. 
 
2014తో పోలిస్తే 20 శాతం పెరిగిన బడ్జెట్​..
ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ చేసుకున్నా, దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట వరకు రూ. 330 కోట్లతో ట్రైన్ విస్తరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. అదే సమయంలో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు. జనవరిలో కొమురవెల్లి స్టేషన్‌ను పూర్తి చేసి మల్లన్న స్వామికి అంకితం చేయనున్నామని స్పష్టం చేశారు. రూ. 720 కోట్లతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఆధునీకరణ జరుగుతుందని చెప్పారు. కాచిగూడ స్టేషన్​ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. బేగంపేట స్టేషన్​ ను మహిళా సిబ్బందితో నిర్వహించేలా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణలో ఇప్పటికే 37 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్​ నాటికి పూర్తవుతాయని వివరించారు. ఇందుకు గాను రూ. 33వేల కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుందన్నారు. మొత్తం అభివృద్ధి పనులు రూ. 42,209 కోట్లతో కొనసాగుతున్నాయని చెప్పారు. బడ్జెట్​ కు అదనంగా మరిన్ని నిధులను తెలంగాణకు కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం రైల్వే బడ్జెట్​ 20 శాతం పెరిగిందన్నారు. 
 
నాడు మేధావిలా మాట్లాడిన కేసీఆర్​.. ఇప్పుడెందుకు వ్యతిరేకత..
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇరురాష్ట్రాల సీఎంలను చర్చలకు పిలిచిందని, తీర్పు ఇచ్చేందుకు కాదని, సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిగా కేంద్రం పాత్ర వహించిందన్నారు. ఈ విషయంలో బీఆర్​ఎస్​ వ్యాఖ్యలు స్థిరంగా ఉండవని కేంద్రమంత్రి మండిపడ్డారు. అప్పట్లో కేసీఆర్​ కృష్ణా బేసిన్​ విషయంలో అనేక వ్యాఖ్యలు చేశారని ఆయనే మేధావి, ఇంజనీర్​, శాస్ర్తవేత్తలా మాట్లాడారని విమర్శించారు. ఆంధ్ర–మహారాష్ర్ట సమస్యకు పరిష్​కారం కనుగొన్నానని, గోదావరి జలాల విషయంలో రాయలసీమకు తరలించవచ్చని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గుణాత్మకమైన మార్పు వచ్చిందని ఇక్కడ కేంద్రానికి అవసరం లేదని ఆ సమయంలో కేసీఆర్ స్పష్టం మాట్లాడారని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు బనకచర్ల విషయంలో బీఆర్​ఎస్​ ఎందుకు వ్యతిరేకించారని నిలదీశారు. జల వివాదాల పరిష్​కారానికి సంబంధించి ఇరు రాష్​ర్టాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైందన్నారు. కేంద్రం ఈ విషయంలో ఎవరికీ అనుకూలం, వ్యతిరేకంగానో లేదన్న విషయం స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. 
 
ప్రజలు ఉద్యమిస్తే కేసీఆర్​ కుటుంబం లబ్ధి పొందింది..
రాజకీయ పార్టీలు ప్రజల మేలు కోసం పనిచేయాలని చెప్పారు. కరువు ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని, రాజకీయాలకే పరిమితమవ్వకూడదని స్పష్టం చేశారు. పదేపదే కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఏం చేశారని? ప్రధాని మోదీ ఏం చేశారని? ప్రశ్నించడమే తప్ప, కేసీఆర్​ ను సమర్థిస్తున్నారంటూ అసత్యాలు వల్లేవేయడమే తప్ప కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలకై ప్రజలు ఉద్యమిస్తే వాటి ఫలితాలను కేసీఆర్ కుటుంబం దక్కించుకుందన్నారు. జాతీయ పార్టీగా బీజేపీ రెండు రాష్ర్టాలకు న్యాయం జరగాలని మాత్రమే కేంద్రం కోరుకుంటుందని స్పష్టం చేశారు. దేశంలో అన్ని రాష్ర్టాలకు యూరియా పంపిణీ విషయంలో కొరత లేకుండా కేంద్రం పంపిణీ చేస్తుందన్నారు. తెలంగాణకు కొరత లేకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి రెండు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిజాలు, అబద్ధాలను ఎండగడుతూ సుధీర్ఘంగా ప్రసంగించారు.