అమీర్ పేట్ లో మోదీ మన్ కీ బాత్ వీక్షణ
దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
ఉచిత బియ్యం కేంద్రానివి బొమ్మ రేవంత్ ది!
మజ్లిస్ కు తొత్తులు బీఆర్ఎస్, కాంగ్రెస్
జూబ్లీహిల్స్ లో కమలం వికసిస్తుంది
నా తెలంగాణ, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కలిసిన చరిత్ర లేదని, ఎవ్వరితోనూ భవిష్యత్ లోనూ కలవబోమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దివ్యాంగుల శ్రేయస్సు దృష్ట్యా వారి అవసరాల మేరకు గాంధీ జయంతి వరకు వారికి అవసరమయ్యే వివిధ రకాల పరికరాలను అందజేస్తామన్నారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అమీర్ పేట్ నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ లో ప్రధానమంత్రి 126వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వీక్షించారు. అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ‘సేవా పక్వాడ్’ సేవాపక్షం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
సేవా కార్యక్రమాల్లో రికార్డులు..
మహిళలకు ఆరోగ్య పరీక్షలు, మాస్టర్ హెల్త్ చెకప్ లు, దివ్యాంగులకు ఆరోగ్య పరీక్షలకు, స్వయం సహాయక సంఘాలకు వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టామని గుర్తుచేశారు. దివ్యాంగులకు కూడా పరికరాల్ని అదే రీతిన అందచేస్తామని హామీ ఇచ్చారు. వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, మొబైల్ ఫోన్లు ఇలా అన్ని రకాల వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఎన్జీవోలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని వివరించారు. మోదీ జన్మదిన ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది ప్రజలు రక్తదానం చేసి గిన్నిస్ రికార్డును సృష్టించారని సంతోసం వ్యక్తం చేశారు.
ఎంఐంఎంతో కలిసిన వారు తమకు నీతులు చెప్పొద్దు..
సమస్యలను పరిష్కరించే ఆలోచన బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఏ మాత్రం లేదని, ఎంఐఎం అండతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని ఇక్కడి ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు. వీరి కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. దేశవ్యాప్తంగా ఆయా దర్యాప్తు సంస్థలు దాడులు ఆ సంస్థల బాధ్యత వారే చూసుకుంటారన్నారు. ఈ దర్యాప్తుకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవగాహన లేకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ ఎవరెవరితో కలిశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలపై పనిచేస్తున్న బీజేపీకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీకున్న ఏకైక లక్ష్యం దేశ ప్రజల మేలన్నారు. ఈ రెండు పార్టీలను నడిపిస్తున్న సమన్వయకర ఎంఐంఎం అసదుద్దీన్ అని ప్రజలకు తెలుసని ఆరోపించారు. గతంలో కలిశారు? భవిష్యత్ లోనూ ఆ పార్టీతో కలిసి పనిచేస్తారని అలాంటి పార్టీలు తమకు నీతులు చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రాబోతుందనే భయం ఈ రెండు పార్టీల నాయకుల్లో కనిపిస్తుందన్నారు. అందుకే విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
తొక్కిసలాట దురదృష్టకరం..
తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాజకీయ పార్టీలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ రూపొందించుకొని నిర్వహించాలన్నారు.
జూబ్లీహిల్స్ లో బీజేపీ డోర్ టు డోర్..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బిజెపి డోర్ టు డోర్ నిర్వహిస్తుందని క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రజల్ని కలుస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కూడా వ్యక్తిగతంగా పర్యటిస్తూ అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని భావిస్తున్నారని చెప్పారు. గతంలో పార్టీలు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. మంచినీరు, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యను పరిష్కరించలేదన్నారు. పెన్షన్, మహిళలకు రూ. 2500 హామీ, నిరుద్యోగుల హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. మజ్లీస్ పార్టీ ధైర్యంతోనే ఈ రెండు పార్టీలు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రం పథకాలు.. రేవంత్ గొప్పలు..
కేంద్ర ప్రభుత్వం ఐదుకేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే దానిపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బొమ్మ వేసుకొని బస్తాల్ని పంపిణీ చేస్తున్నాడని విమర్శించారు. బస్తీ దవాఖానాలు, పొదుపు సంఘాలకు, నిరుద్యోగ యువతకు ముద్ర రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ రెండు పార్టీల చర్యలను జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టేందుకు కమలం పార్టీని వికసింప చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.